తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ పార్టీకి చెందిన మరికొందరు ముఖ్య నేతలు ఢిల్లీలో ఉన్నారు. సిడబ్ల్యూసి సమావేశల కోసం వీరు ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఢిల్లీ టూర్లో మంత్రివర్గ విస్తరణ పై కూడా రేవంత్ టీం అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డి వద్ద ఉన్న పీసీసీ పదవిని కూడా మరొకరికి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రి పదవులపై, పిసిసిపై ఆశలు పెట్టుకున్న నేతలు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మంత్రి పదవి రేసులో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. వీరితోపాటు ముస్లిం మైనారిటీ నుండి ఒకరికి, ముదిరాజ్.... లంబాడా సామాజిక వర్గాల నుండి ఒకరికి మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఒకరికి మంత్రి పదవి వరిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో వివేక్ ఫ్యామిలీలో నుండి అధిష్టానం ముగ్గురికి టికెట్లు ఇచ్చింది.

ప్రస్తుతం ఒకరు ఎంపీగా, ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దీంతో వారికి కాకుండా సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు రేవంత్ రెడ్డి పిసిసి పదవిని సీతక్కకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పిసిసి పదవి కోసం సీతక్కతోపాటు మరికొందరు రేసులో ఉన్నారు. వారిలో అద్దంకి దయాకర్ కూడా ఉన్నట్టు సమాచారం.

ఇక నల్గొండలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఇప్పటికే మంత్రి పదవులు దక్కాయి. జిల్లాలో రెండు మంత్రి పదవులు వరించాయి... ఇప్పుడు అదే జిల్లాకు చెందిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరగడంతో ఇతర జిల్లాల సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఆరు మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: