- ఈ ఇద్దరికి మంత్రి పదవులిస్తేనే పార్టీకి జోష్ అంటోన్న కేడర్
- రాము కోసం ఎన్నారై లాబీ... చింతమనేని కోసం ఒక్కటవుతోన్న జిల్లా నాయకులు
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో కూటమి ఘనవిజయంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 12న జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలోనే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్లివచ్చిన బాబు అమరావతిలో కేబినెట్ కూర్పుపై కసరత్తులు ముమ్మరంగా చేస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చింది మొదలు పలువురు ఆశావాహులు కేబినెట్‌లో బెర్త్ కోసం బాబును కలవడమో లేదా ఆయనపై రకరకాల ఒత్తిళ్లు పనిచేసేలా చేయడమో లేదా బలమైన లాబీయింగో మొదలు పెట్టేశారు.
ఈ క్రమంలోనే టీడీపీలో ఈ ఎన్నికల్లో సెన్షేషనల్ విజయాలు సాధించిన ఇద్దరు ఫైర్ బ్రాండ్ లీడర్లకు మంత్రి పదవుల కోసం చాలా మంది నేతలు... ఇంకా చెప్పాలంటే ఎన్నారైల స్థాయిలో బాబుపై ఒత్తిళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నేతలకు ఖచ్చితంగా మంత్రి పదవులు ఇస్తేనే వారి విజయానికి సార్థకత ఉంటుందని కూడా బాబుకు సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గుడివాడ నుంచి గెలిచిన వెనిగండ్ల రాము గెలుపు పార్టీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది.
ఈ సారి చాలా మంది టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు సీఎం అయినా గుడివాడలో కొడాలి నాని ఓడకపోతే ఆ గెలుపునకు సార్థకత లేదని ఓపెన్‌గా చెప్పేశారు. రాష్ట్రం అంతటా గెలిచినా గుడివాడలో టీడీపీ గెలవడంతోనే ఈ బంపర్ విక్టరీకి సార్థకత వచ్చిందని ప్రతి ఒక్కరు ఫీలవుతున్నారు. చంద్రబాబు, లోకేష్‌పై బూతులతో విమర్శించడం మాత్రమే కాదు.. టీడీపీ లైఫ్ ఇస్తే అదే టీడీపీ అధినేతను ఘోరంగా విమర్శించడం.. ఇటు పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ప్రాథినిత్యం వహించిన పార్టీ కంచుకోటలో నాని 20 ఏళ్లకు పైగా పాగా వేయడం ఎవ్వరికి రుచించడం లేదు.
రాము నానిపై గెలవడం ఒక ఎత్తు అయితే.. నానికి పీడకలలాంటి పరాభవం మిగిల్చారు. ఎంతో టైట్ ఉంటుందని అందరూ అనుకున్న గుడివాడలో ఏకంగా 53 వేల ఓట్ల భారీ మెజార్టీతో బంపర్ విక్టరీ కొట్టారు. ఈ ఎన్నికల్లో నానిమీద వ్యతిరేకత, కూటమి వేవ్ మాత్రమే కాదు.. తన వ్యక్తిగత మేనిఫెస్టోతో గుడివాడ ప్రజల మనస్సులను రాము కొల్లగొట్టారు. నియోజకవర్గంలో యువతకు 10 వేల ఉద్యోగాలిస్తానని చెప్పి... ఎన్నికలకు ముందు 2 వేలు ఉద్యోగాలిచ్చారు. ఇలా రాము వ్యక్తిత్వంతో పాటు సౌమ్యుడిగా ఉండడం కూడా గుడివాడ ప్రజల మనస్సులను దోచుకున్నారనే చెప్పాలి.
ఇక ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ కు సైతం కేబినెట్ బెర్త్ ఇవ్వాలని జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేతలు బాబుపై లాబీయింగ్‌తో పాటు బాగా ప్రెజర్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సారి ఉమ్మడి జిల్లాలో కమ్మ వర్గం ఏలూరు పార్లమెంటు, నిడదవోలు, ఉంగుటూరు సీట్లు త్యాగం చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి మొత్తం మీద దెందులూరు, తణుకులో మాత్రమే కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభాకర్‌కు మంత్రి పదవి కోసం భారీ స్థాయిలో లాబీయింగ్ నడుస్తోంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ నేతలు అందరూ ఒక్కటవుతున్నారు. మరి గుడివాడలో రాము, దెందులూరులో ప్రభాకర్ మంత్రులు అవుతారో లేదో కొద్ది గంటల్లో తేలిపోనుంది.