ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి ఉంది. ఆధిపత్యం కోసం రాజకీయాలు, పాలనా విషయాల్లో వీరు ఒకరి మీద ఒకరు పైచేయి సాధించేందుకు యత్నిస్తున్నారు. విషయం ఏమిటంటే 4 నెలల క్రితం జరిగిన మేడారం జాతర సమయంలో మొదలైన ఈ పంచాయితీ కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జి మార్పు విషయంలో తారాస్థాయికి చేరుకుంది. కొండా సురేఖ వరంగల్‌ జిల్లాలోని ధార్మిక భవన్‌ నుండి కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తున్నది. అయితే ధార్మిక భవన్‌ను వేరే వాటి కోసం వినియోగించే ఆలోచన చేయడం సరికాదని సీతక్క వర్గీయులు ఆమె చర్యలకు అడ్డుకట్ట వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ధార్మిక భవన్‌లో సమ్కక్క - సారలమ్మ ఈవో ఆఫీసును కొనసాగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు మేడారంలో పూజలు నిర్వహించకూడని అక్కడి పూజారులు ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఈ తంతు వెనక సీతక్క హస్తం ఉందని కొండా సురేఖ వర్గీయులు గుసగుసలు ఆడుకుంటున్నారు. సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో సమ్మక్క సారలమ్మ దేవాలయం ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇకపోతే ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి జాతరకు వచ్చిన రోజు జాతర నిర్వహణ, పనుల పర్యవేక్షణ అంతా సీతక్కే దగ్గరుండి మరీ చూసుకున్నారు.

ఇకపోతే, ఆనాడు సీతక్క సూచనలతోనే సొంత సెగ్మెంట్‌ నుంచి కొండా సురేఖను దూరం పెట్టారని ఆమె వర్గీయులు అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. మరోవైపు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి చెందిన మేయర్‌ గుండు సుధారాణిని తనకు సమాచారం లేకుండా సీతక్క ప్రమేయంతోనే కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని కూడా సురేఖ అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా మెదక్ పార్లమెంట్ లో కాంగ్రెస్ ఓడిపోగా, వరంగల్ లో విజయం సాధించింది. దీని మీద కూడా కొండా సురేఖ వర్గీయులు అసంతృప్తిగా ఉన్నట్టు భోగట్టా.

మరింత సమాచారం తెలుసుకోండి: