- ఇప్పుడు స్పీకర్ కూడా బీసీ అయ్యన్నకే
- జగన్ బీసీ ఎత్తులను చిత్తుచేస్తోన్న చంద్రబాబు
( ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
బీసీలే పార్టీకి వెన్నెముక అని చెప్పే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ మాటను నిరూపిస్తున్నారు. తాజా ఎన్నికల్లో బీసీలు పార్టీ వెంటే ఉన్నారని గ్రహించిన ఆయన.. ఈ అపూర్వ విజ యం వెనుక.. వారందించిన ప్రోత్సాహాన్ని గుర్తు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కీలక పదవులను బీసీ సామాజిక వర్గాలకు కేటాయిస్తున్నారు. ఇప్పటికే మంత్రి వర్గంలో ఐదుగురి వరకు బీసీలకు అవకాశం ఇచ్చారు. అచ్చెన్నాయుడు సహా.. మహిళా నాయకురాలు సవితకు కూడా.. ప్రాధాన్యం పెంచారు.
ఇప్పుడు రాజ్యాంగ బద్ధమైన పొజిషన్లను కూడా.. బీసీలకు కేటాయిస్తుండడం గమనార్హం. కీలకమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఏడు సార్లు విజయం దక్కించుకున్న నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడికి అప్పగించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నిజానికి చంద్రబాబు హయాంలో ఎస్సీ మహిళ ప్రతిభా భారతికి, బీసీ నాయకుడు.. సీనియర్ మోస్ట్ నేత.. యనమల రామకృష్ణుడుకు కూడా ఇచ్చారు.
అనంతరం 2014-19 మధ్య మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోడెల శివప్రసాద్‌కు స్పీకర్ పదవిని ఇచ్చారు. ఇక, ఇప్పుడు.. అయ్యన్న పాత్రుడికి అప్పగించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక, పార్టీ అధ్యక్ష పదవిని కూడా మరోసారి బీసీలకే ఇవ్వడం గమనార్హం. రాజకీయంగా టీడీపీకి వచ్చే ఐదేళ్లు అత్యంత కీలకమనే విషయం తెలిసిందే. పార్టీ అధికారంలో ఉన్నా.. టీడీపీని డెవలప్ చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీసీ నాయకుడు.. అచ్చెన్నకు పార్టీ బాధ్యతల నుంచి రిలీవ్ ఇచ్చిన చంద్రబా బు అనేక మంది రెడ్డి, కమ్మ నాయకులు ఎదురు చూసినప్పటికీ.. పార్టీ పగ్గాలను బీసీ నాయకుడు పల్లా శ్రీనివాస యాదవ్‌కు అప్పగించారు. తద్వారా తమపార్టీ బీసీలకు అండగా ఉంటుందనే బలమైన సంకేతాలను చంద్రబాబు మరోసారి పంపించారు. జగన్ పేరుకు మాత్రమే కొందరు బీసీ నేతలకు పదవులు ఇచ్చినా.. వారికి నిజమైన రాజ్యాధికారం ఇవ్వలేదు.
అయితే ఇప్పుడు బాబు అలా కాకుండా కీలక పదవులు బీసీలకు కట్టబెడుతూ వారికి నిజమైన నిర్ణయాత్మక పవర్ ఇస్తున్నారు. ఇది అసాధారణ నిర్ణయమనే చెప్పాలి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.