కొడాలి నాని, రోజా, తమ్మినేని సీతారాం, అంబటి రాంబాబు సహా చాలా మంది నేతలు రాజకీయ నేతలకు తగని భాష మాట్లాడారు. అసెంబ్లీలో కూడా దిగజారి ప్రవర్తించినప్పుడు జనాల్లో ఒక అభిప్రాయం వెళ్లిపోయింది. గత ఐదేళ్లలో ఏపీలో అభివృద్ధి జరగలేదు. రాజకీయాలు కూడా చాలా అంటే చాలా దిగువ స్థాయికి పడిపోయాయి. అందుకే వైసీపీకి అంతటి ఘోర ఓటమిని కట్టబెట్టారు. వైసీపీ ఓటమిని చూసి టీడీపీ కూటమి జాగ్రత్తగా వ్యవహరించుకోవాలని రాజకీయ విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు.
అయితే అధికారంలోకి రాగానే చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేతలు హద్దులు దాటి మాట్లాడకపోవచ్చు కానీ ఆయన కింద ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు లిమిట్ క్రాస్ చేయవచ్చు. టీడీపీలో కూడా వైసీపీ నేతల్లా రెచ్చిపోయి మాట్లాడే వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో అయ్యన్నపాత్రుడు ముందుంటారు. స్పీకర్ పదవి బాధ్యతలు స్వీకరించనున్న సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మొత్తం పార్టీకే తలవొంపులు తెచ్చేలాగా ఉన్నారు.
రీసెంట్‌గా ఈ నేత అధికారుల మీద బూతు పురాణం అందుకున్నారు. ఆయన బూతులతో రెచ్చిపోయిన వీడియో కూడా ఏపీలో సంచలనం రేపింది. ఇక మంత్రి అచ్చెన్నాయుడు కూడా అధికారంలోకి రాగానే కొమ్ములు వచ్చినట్లు మాట్లాడుతూ షాక్ ఇస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్ల పెట్టుకుని ఆఫీసులకు వెళ్తే అధికారులు గౌరవించాల్సిందే అని ఆయన డిమాండింగ్ గా మాట్లాడారు. అలాంటి కార్యకర్తలకు పనిచేయకపోతే అధికారుల సంగతి చూస్తాం అంటూ హెచ్చరించారు. ఆయన తీరుపై విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఎందుకంటే అధికారులతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడిన దాఖలాలు లేవు.
ఇదిలా ఉండగా అనంతపురం జిల్లా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతీకారం తీర్చుకుంటానని బహిరంగంగా మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. తనపై వైసీపీ హయాంలో కేసులు పెట్టిన రవాణా అధికారికి చుక్కలు చూపిస్తానంటూ ఆయన ప్రెస్ మీట్లో అసభ్య పదజాలం వాడారు. అధికారంలోకి వచ్చి ఇంకా నెల కూడా పూర్తి కాలేదు. అంటే నెల పూర్తయ్యాక ఇలా రెచ్చిపోమ్మని చెప్పడం లేదు కానీ టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగుతూ అభివృద్ధి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇలాంటి నేతలను కంట్రోల్లో ఉంచాల్సిన బాధ్యత చంద్రబాబుకే లేదంటే ఆయన జగన్ లాగానే ఓడిపోయే ప్రమాదం ఉంది వైసీపీకి టిడిపికి తేడా ఏంటి అని ప్రజలు ఈసారి వేరే పార్టీని గెలిపించినా గెలిపిస్తారు. కాబట్టి కింద స్థాయి నేతల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా చంద్రబాబు ఉండాల్సిన అవసరం ఉంది.