వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ శ‌నివారం నుంచి పులివెందుల‌లో ప‌ర్య‌టన ప్రారంభ‌మైంది. ఒక‌వైపు స‌భ జ‌రుగుతున్నా.. స్పీక‌ర్ ఎంపిక జ‌రుగుతున్నా.. ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న‌కే ప్రాధాన్యం ఇచ్చారు. స‌రే.. పులివెందుల‌లో జ‌గ‌న్ ఎవ‌రిని క‌ల‌వ‌నున్నార‌నేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. ఎన్ని క‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఇంత అర్జంటుగా ఆయ‌న ఎప్పుడూ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ లేదు. మ‌రి ఇప్పుడే ఎందుకు వెళ్తున్నారు? అనేది ప్ర‌శ్న‌.


2014, 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. మూడు మాసాల త‌ర్వాత ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. కానీ.. ఇప్పుడు మాత్రం జ‌గ‌న్ ఆగ‌మేఘాల‌పై నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. దీనికి కార‌ణం.. ఏంటి? అంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌తంలో ఉన్న ప‌రిస్థితి ఇప్పుడు లేదు. గ‌తంలో వ‌చ్చిన మెజారిటీ కూడా త‌న‌కు రాలేదు. దీనికి కొంద‌రు సొంత నేత‌లే.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేశార‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో వాటిని చ‌క్క‌దిద్దేందుకు జ‌గ‌న్ వెళ్తున్నార‌ని స‌మాచారం.


ఇదేస‌మ‌యంలో బ‌ల‌మైన కంచుకోట‌ల వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ ఓడిపోయింది. అస‌లు అక్క‌డ ఏం జ‌రిగింది?  ముఖ్యంగా ష‌ర్మిల ప్ర‌భావం ఎంత ప‌డింది? అనే విష‌యాల‌పైనా జ‌గ‌న్ దృష్టి పెడుతు న్నారు. మ‌రీ ముఖ్యంగా.. తన పార్టీలోనే ఉంటూ.. ష‌ర్మిల‌కు కొంద‌రు సాయం చేశార‌న్న వాద‌న ఉంది. దీనిని కూడా ఆరా తీయ‌నున్నారు. ఇప్ప‌టి నుంచే ప్ర‌క్షాళ‌న చేయ‌డం ఇప్పుడు జ‌గ‌న్ పెట్టుకున్న ల‌క్ష్యంగా ఉంది. వ‌చ్చే రెండేళ్ల‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఉన్నాయి.


అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడ‌డం కాకుండా.. ఇప్ప‌టి నుంచి పార్టీప‌రంగా జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ముందు త‌న నియోజ‌క‌వ‌ర్గం.. త‌న జిల్లా నుంచే ఈ ప‌ర్య‌ట‌నను ఆయ‌న ప్రారంభించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. జ‌మ్మ‌ల‌మ‌డుగు, రాయ‌చోటి, క‌మ‌లాపురం వంటివి వైసీపీకి కంచుకోట‌లు. ఇక్క‌డే పార్టీ ఓడిపోయింది. దీని వెనుక‌.. ఏం జ‌రిగింద‌నేది ఇప్పుడు ఆరా తీయ‌డం ద్వారా.. ఇదే ఫార్ములాను ఇత‌ర జిల్లాల్లో స‌మీక్షించి స‌రిచూసుకునే అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. అందుకే త‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచే ఆయ‌న ఆప‌రేష‌న్ ప్రారంభించార‌ని తెలుస్తోంది. చివ‌ర‌కు ఏం తేలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: