- ఎంపీలు కేంద్రం మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
కాలం కలిసి వచ్చింది. ఒకప్పుడు టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు కలిసి వచ్చిన సమయంలో పార్టీ పుంజుకుంది. ఇది పార్టీకే కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలకు కూడా తోడ్పాటు అందించే క్రమంలో మేలైన ఉపయోగం వరించేలా చేస్తుంది. దీంతో సుదీర్ఘ కాలంగా పదేళ్లుగా కేంద్రం పట్టించుకోని విభజన చట్టం హామీలను అమలు చేయించుకునే అవకాశం టీడీపీ ఎంపీలకు దక్కింది. దీనికి జనసేన కూడా సహకరిస్తుంది కాబట్టి మరింత అవకాశం.
ముఖ్యంగా విభజన చట్టంలోని అంశాల్లో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న విశాఖ రైల్వే జోన్.. వంటివి ఉన్నాయి. అదేసమయంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ సహా.. ఉద్యోగుల విభజన, కేంద్ర నిధులు వంటివి సాధించుకునే ఛాన్స్ మెండుగా ఉంది. ఇప్పుడు ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో వాటిని ప్రస్తావించడం ద్వారా.. సాధించుకునేందుకు టీడీపీ ఎంపీలు ప్రయత్నించాలి. ఇక్కడ కలిసి వస్తున్న మరో విషయం తెలంగాణ.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండడం.. ఆ ప్రభుత్వం కూడా.. విభజన హామీలను అమలు చేయాలని కోరుతుండడం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా.. 8 మంది ఎంపీలు ఉన్నారు. గతంలో విబజన చేసిందే ఆ పార్టీ కావడం గమనార్హం. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి కూడా.. సాధ్యమైనంత వేగంగా విభజన చట్టాన్నిఅమలు చేయించుకుని.. రాష్ట్రానికి రావాల్సిన.. ప్రాజెక్టులు రప్పించుకునే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు.
ఇప్పుడు పాలు- పంచదార మాదిరిగా.. ఏపీ-తెలంగాణ అధికార పార్టీల ఎంపీలు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా.. బుజ్జగించినా.. ఈ హామీల అమలు పెద్దగా కష్టం కాదు. చేయాలన్న చిత్తశుద్ధి ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఈ విషయంలో కొంత ప్రయత్నం చేయగలిగితే.,. రాష్ట్రానికి టీడీపీ మరింత మేలు చేయడంతోపాటు.. 22 మంది ఎంపీలు ఉన్నా.. సాధించని వైసీపీ ముందు కాలర్ ఎగరేసుకునే అవకాశం దక్కనుంది. మరి ఆదిశగా ఎంపీలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటే మంచిదని అంటున్నారు పరిశీలకులు.