- ఐదేళ్ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో పులివెందుల టూర్ చెప్పేసిందా
- అర్ధ‌రాత్రి వ‌ర‌కు లోక‌ల్ కేడ‌ర్‌ను బ‌తిమిలాడుకున్న మాజీ సీఎం
- లోప‌ల‌కు ఎవ్వ‌రికి ఎంట్రీ లేద‌ని బోర్డ్ పెట్టాల్సి వ‌చ్చిందే

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు నిద్ర ప‌ట్ట‌డం లేదా?  ఒక‌వైపు పార్టీ ఓట‌మి.. మ‌రో వైపు త‌న హ‌యాంలో ప‌నులు చేసిన సొంత పార్టీ కాంట్రాక్ట‌ర్ల నుంచి తీవ్ర ఒత్తిడికిగుర‌వుతున్నారా?  అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌ని నేప‌థ్యంలో ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లారు. పులివెందుల‌లోనే మూడు రోజులు మ‌కాం వేసి.. సేద దీరాల‌ని భావించారు. అయితే.. వెళ్లిన క్ష‌ణం నుంచి ఆయ‌న‌ను సొంత పార్టీ నేత‌లు ఈగ‌ల్లా ముసిరేశారు.


చేసిన ప‌నులకు సొమ్ములు రాలేద‌ని.. త‌మ ప‌రిస్థితి ఏంట‌ని జ‌గ‌న్‌ను వెంటాడారు. దీంతో అర్ధ‌రాత్రి వ‌ర‌కు కూడా..వారిని జ‌గ‌న్ స‌ర్దిచెప్పాల్సి వ‌చ్చింది. అయినా.. ఈ వేధింపులు తప్ప‌క‌పోవ‌డంతో రెండు రోజుల్లోనే పులివెందుల ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని .. అస‌లు షెడ్యూల్‌లో కూడా లేని బెంగ‌ళూరుకు వెళ్లిపోయారు. వాస్త‌వానికి పులివెందుల‌లో మూడు రోజుల ప‌ర్య‌ట‌న వ‌ర‌కు షెడ్యూల్ ఉంది. త‌ర్వాత‌.. ఆయ‌న తాడేప‌ల్లికి వ‌చ్చి.. మ‌రోసారినాయ‌కుల‌తో భేటీ అవ్వాల‌ని అనుకున్నారు.


త‌ర్వాత‌.. భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించి.. ఆ దిశ‌గా అడుగులు వేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నా రు. కానీ..పులివెందుల ఎఫెక్ట్ చూసిన త‌ర్వాత‌.. రెండు రోజుల్లోనే ఆయ‌న బెంగ‌ళూరుకు వెళ్లిపోయారు. ఇదేస‌మ‌యంలో త‌న షెడ్యూల్‌లోనూ.. భారీ మార్పులు చేసుకున్నారు. ఏకంగా ప‌ది రోజుల వ‌ర‌కు బెంగ‌ళూరులోనే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే..ఇక్క‌డ కూడా.. కాంట్రాక్ట‌ర్లు వెంబ‌డించారు. ఆయ‌న వ‌స్తున్నార‌ని తెలిసి.. కాంట్రాక్ట‌ర్లు ఎల‌హంక‌లోని ఆయ‌న ఇంటిని చుట్టుముట్టారు.


ఇక‌, చేసేది లేక‌.. క‌ఠిన ఆదేశాలు ఇచ్చారు. ఎవ‌రినీ లోప‌లికి అనుమ‌తించ‌వ‌ద్ద‌ని చెప్ప‌డంతో సిబ్బంది గేట్ల‌ను మూసేశారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే..జ‌గ‌న్ నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. గ‌తంలో చంద్ర‌బాబు కూడా.. ఇలానే కాంట్రాక్ట‌ర్ల‌కు బకాయి పెట్టారు . కానీ, ఆయ‌న‌పై ఈ స్థాయిలో ఒత్తిడి రాలేదు. ఎందుకంటే.. అప్ప‌ట్లో క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు చేయ‌లేదు. దీంతో త‌మ‌కు త‌ర్వాత వ‌చ్చిన జ‌గ‌న్ స‌ర్కారు ఇస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఆగారు. కానీ, ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి ఉండ‌ద‌ని గ్ర‌హించి ఆయ‌న‌పై ఒత్తిడి పెంచుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: