- బీజేపీ పొత్తుకు ర‌మ్మ‌న్నా నో చెప్పిన జ‌గ‌న్‌
- ఇన్‌డైరెక్టుగా అయినా బీజేపీకి స‌పోర్ట్ చేయ‌క త‌ప్ప‌ని పరిస్థితి
- కేసులు.. క‌ష్టాలు బీజేపీతో పొత్తుంటే ఈ గోల ఉండేదే కాదు

( విశాఖ‌పట్నం - ఇండియా హెరాల్డ్ )

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ వ‌ర్సెస్ కేంద్రంలోని బీజేపీ మ‌ధ్య చాలా అంత‌ర్గ‌త రాజ‌కీయాలు సాగాయి. చంద్ర‌బాబుతో చేతులు క‌లిపే వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్‌-బీజేపీల మ‌ధ్య రాజ‌కీయాలు వ్యూహాత్మ‌కంగా సాగాయి. మాతో చేతులు క‌ల‌పండి! అని బీజేపీ నాయ‌కులు ప‌దే ప‌దే కోరారు. వాస్త‌వానికి టీడీపీకంటే కూడా.. వైసీపీ వైపు అమిత్‌షా, జేపీ న‌డ్డా వంటివారు.. దృష్టిసారించారు. బ‌ల‌మైన ఓటు బ్యాంకు.. బ‌ల‌మైన ప్ర‌భుత్వం ఉన్న‌ద‌రిమిలా.. జ‌గ‌న్‌తో ఉంటే బాగుంటుంద‌ని అంచ‌నా వేసుకున్నారు.


ఈ క్ర‌మంలో సాధ్య‌మైనంత వ‌ర‌కు పొత్తుల కోసం ప్ర‌య‌త్నించారు. ఈ విష‌యాన్ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు కూడా.. చెప్పుకొచ్చారు. ఒకానొక ద‌శ‌లో జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌వ‌ద్దు.. కేవ‌లం ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను మాత్ర‌మే టార్గెట్ చేయాలంటూ.. బీజేపీ నుంచి రాష్ట్ర నాయ‌క‌త్వానికి సంకేతాలు వ‌చ్చాయి. దీంతో సోము వీర్రాజు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వంటివారు.. నేరుగా జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌లేక పోయారు. ఈ ఒత్తిడి కార‌ణంగానే క‌న్నా పార్టీ నుంచి త‌ప్పుకొని టీడీపీలోకి చేరిపోయారు.


అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు.. వ‌ర‌కు కూడా జ‌గ‌న్ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించ‌లేదు. పైగా బీజేపీతో తాము చేతులు క‌లిపేది లేద‌ని చెప్పుకొచ్చారు. దీనికి కూడా కార‌ణం ఉంది. ముస్లింల రిజ‌ర్వేష‌న్‌ను ఎత్తేస్తామ‌ని బీజేపీ పెద్ద‌లు ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామంతోనే జ‌గ‌న్ బీజేపీకి దూరంగా ఉన్నారు. పైగా త‌న‌పై త‌న‌కు అచంచ‌ల విశ్వాసం కూడా.. ఆయ‌న‌ను పొత్తుల దిశ‌గా న‌డిపించ‌లేక పోయింది. అయితే.. మ‌రోవైపు అంత‌ర్గ‌తంగా బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది.


త‌న‌పై ఉన్న కేసులు కావొచ్చు.. రాష్ట్రానికినిధులు, అప్పులు తీసుకోవాల్సిన అవ‌స‌రం కావొచ్చు. ఎలా చూసుకున్నా.. జ‌గ‌న్ బీజేపీతో అంట‌కాగ‌క త‌ప్ప‌లేదు. మ‌రి పొత్తులు పెట్టుకునేందుకు ఉన్న ఇబ్బంది.. ఇలా తెర‌చాటు చేతులు క‌లిపితే లేదా? అనే ప్ర‌శ్న కూడా ఉత్ప‌న్న‌మైంది. మొత్తానికి పొత్తులు పెట్టుకుని ఉంటే.. ఆయ‌న గెలుపు సాధ్య‌మ‌య్యేద‌న్న భావ‌న ఉంది. పోనీ.. ఎన్నిక‌ల్లో ఓడిన త‌ర్వాతైనా. ఆయ‌న‌కు ఈ అంత‌ర్గ‌త రాజ‌కీయం త‌ప్పిందా? అంటే.. లేదు. తాజాగా పార్ల‌మెంటు స్పీక‌ర్ ఎన్నిక విష‌యంలో బీజేపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌క త‌ప్ప‌లేదు. మొత్తానికి దూర‌దృష్టిలోపం.. వైసీపీని ఇరుకున ప‌డేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: