2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయిన సమయంలో తండ్రిని మించిన తనయుడు అని అనిపించుకుంటాడని చాలామంది భావించారు. 2004, 2009 సంవత్సరాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషి ఎంతో ఉంది. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయి.
 
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాల వల్ల విద్య, వైద్యం ఎంతోమందికి చేరువైంది. ప్రజల కనీస అవసరాలను తీర్చే పథకాలకు వైఎస్సార్ ప్రాధాన్యత ఇచ్చారు. ఎంతో ముందుచూపుతో వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలు 2009లో కాంగ్రెస్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. అయితే వైఎస్సార్ లా జగన్ అమలు చేసిన మరీ అద్భుతమైన పథకాలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి.
 
వైఎస్సార్ ఎప్పుడూ ప్రతి స్కీమ్ కు తన పేరే ఉండాలని ప్రతిపక్ష పార్టీ నేతలను ఇబ్బంది పెట్టాలని భావించలేదు. ఎంత బిజీగా ఉన్నా ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు, కష్టాల్లో ఉన్నవాళ్లకు అందుబాటులో ఉంటూ తన మార్క్ పాలన సాగించారు. జగన్ మాత్రం వైఎస్సార్ కు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం జగన్ కు మైనస్ అయింది.
 
వైఎస్సార్ పాలనను మెచ్చిన ఏపీ ప్రజలు జగన్ పాలనను ఎందుకు మెచ్చుకోలేదో అర్థం చేసుకుంటే జగన్ కు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. చంద్రబాబు తన అనుభవంతో క్లిష్టమైన సమస్యలను సైతం పరిష్కరించుకుని అధికారాన్ని సొంతం చేసుకోగా జగన్ మాత్రం తన అనుభవలేమితో తప్పు మీద తప్పు చేస్తూ పార్టీకి, నేతలకు సైతం కొత్త కష్టాలు రావడానికి కారణమయ్యారు. చంద్రబాబుకు భవిష్యత్తులోనైనా గట్టి పోటీ ఇవ్వాలంటే జగన్ తప్పనిసరిగా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ లో మార్పు రాకపోతే వైసీపీ పుంజుకునే అవకాశాలు తక్కువేనని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ysr