ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందున్న ల‌క్ష్యాలు ఏంటి? ఆయ‌న ఎలా ముందుకు సాగాలి?  ఎలాంటి వ్యూహాలు వేయాలి?  ఈ విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం క‌ళ్ల ముందు క‌నిపిస్తున్న ఏకైక ఆప్షన్‌.. నిర్మాణాత్మ‌క ప్ర‌తిప‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే. ప్ర‌జ‌ల స‌మస్య‌ల‌ను నిరంత‌రం ప్ర‌శ్నిస్తూ.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ.. మీడియా ముందుకు వ‌స్తూ.. త‌ర‌చుగా స‌మావేశాలు పెడుతూ.. ఆయ‌న త‌న పంథాను మార్చుకోవాలి.


ఇదేసమ‌యంలో పార్టీకార్య‌క‌ర్త‌ల‌కు దూర‌మ‌య్యార‌న్న అపప్ర‌ద‌ను కూడా తొలిగించుకోవాలి. ముఖ్యంగా గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఉన్న పార్టీ వాతావ‌ర‌ణం.. త‌ర్వాత క‌నిపించ‌కుండా పోయింది. నాయ‌కులు ఏలిక‌లై.. నియోజ‌క‌వ‌ర్గాల్లో చేసిన పెత్త‌నం ప‌లితంగా కేడ‌ర్ పూర్తిగా దెబ్బ‌తింది. తాను క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించ‌క‌పోగా.. నివేదిక‌ల‌ను ఆధారంగా చేసుకుని.. స‌ర్వేల‌ను న‌మ్మిన జ‌గ‌న్‌.. కేడ‌ర్ అంతాబాగానే ఉంద‌న్న భ్ర‌మ‌ల‌తోనే కాలం వెళ్ల‌దీశారు.


ఫ‌లితంగా పైకి వినిపించిన మెప్పులు.. క‌నిపించిన‌.. పొగ‌డ్త‌లు .. ఎన్నిక‌ల స‌మ‌యానికి క‌నుమ‌రుగ‌య్యా యి. అయితే. ఒక్క‌టే ఆశాజ‌నకంగా ఉంది. 40 శాతం త‌న ఓటు బ్యాంకును కాపాడుకునే విష‌యంలో జ‌గ‌న్ కొంత వ‌ర‌కు మెరుగ‌య్యారు. దీనిని మున్ముందు పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది . అంతేకాదు.. ఈ ఓటు బ్యాంకును ప‌దిలంగా కాపాడుకోవాల్సిన అవ‌స‌రం కూడా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఇస్తున్న ప‌థ‌కాలు.. వ‌చ్చే ఎన్నిక ల నాటికి  కాంగ్రెస్ స‌హా ఇత‌ర ప‌క్షాలు పుంజుకునే అవ‌కాశం ఉంది .


దీంతో సంస్థాగ‌తంగా ప్ర‌స్తుతం ఉన్న ఓటు బ్యాంకు కుదేలైతే.. చెదిరిపోతే.. మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వు. మ‌బ్బుల్లో నీళ్లు చూసుకున్న చందంగా ఇప్పుడున్న‌దే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఉంటుంద‌ని అనుకుంటే భ్ర‌మే. అన్నీ మంచే చేశాం.. ఓట్లు మ‌న‌కే.. అధికారం మ‌నదే అనుకున్న‌ట్టే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి మారే అవ‌కాశం ఉంటుంది. సో.. ఈ ప‌రిణామాల‌ను అంచనా వేసుకుని.. నిస్తేజం నుంచి నిర్మాణాత్మ‌క దిశ‌గా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: