ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న వలంటీర్లకు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జులై 1వ తేదీన ఇవ్వాల్సిన పింఛన్ల బాధ్యతల నుంచి ఏపీ సర్కార్ వలంటీర్లను తప్పించిన సంగతి తెలిసిందే. తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని రాజీనామా చేయని వలంటీర్లు సైతం టెన్షన్ పడుతున్నారు. అయితే వాళ్లకు షాకిచ్చేలా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
 
ఉన్నం మురళీధర్ రావు అనే సీనియర్ న్యాయవాది రాష్ట్రంలోని వలంటీర్లను తొలగించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురించి ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వలంటీర్ల ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్లను పాటించలేదని వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని పిటిషన్ దాఖలు కాగా ఈ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
 
అయితే పిటిషన్ లో ప్రస్తావించిన అంశాలు నిజమేనని ఏపీ ప్రభుత్వం కౌంటర్ ఇస్తే మాత్రం వలంటీర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లు పాటించలేదని ప్రూవ్ అయితే వలంటీర్లు ఉద్యోగాలు కోల్పోయే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే రాజీనామా చేసిన వలంటీర్లు తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఏపీ నేతలను కోరుతున్నారు.
 
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే తమ జీతాలు రెట్టింపు అవుతాయని భావించిన వలంటీర్లకు ఆ ఆశలు అడియాశలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వలంటీర్లను తొలగించాలని ఆదేశాలు వెలువడితే ఆ తర్వాత టీడీపీ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది. రాష్ట్రంలోని వలంటీర్లు అందరినీ తొలగిస్తే మాత్రం సంచలనం అవుతుందని చెప్పవచ్చు. రాష్ట్రంలోని లక్షల సంఖ్యలో వలంటీర్లను ఒకేసారి తొలగిస్తే ఆ ప్రభావం వాళ్ల కుటుంబాలపై సైతం పడుతుంది. హైకోర్టు తీర్పు ఆధారంగా కూటమి ప్రభుత్వం వలంటీర్ల విషయంలో ముందుకెళ్లనుంది. వలంటీర్లు మాత్రం తమ జీవనాధారమైన ఉద్యోగం పోతుందేమో అని భయాందోళనకు గురవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: