- 2014, 2019లో ఓడి 2024 ఎన్నిక‌ల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు
- పుంగ‌నూరు పెద్దిరెడ్డి అరాచ‌కాల‌పై పోరాడిన మొండిఘ‌టం
- అన్న కిర‌ణ్‌కు త‌గ్గ త‌మ్ముడిగా... వివాద‌ర‌హితుడిగా గుర్తింపు

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

సుదీర్ఘ రాజ‌కీయ కుటుంబం. ఎప్పుడూ.. రోడ్డెక్కింది లేదు. నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేసే చాన్సే చిక్క‌లే దు. ఆ అవస‌రం కూడా రాలేదు. కార‌ణం.. తాము ఉన్న ప్ర‌తిపార్టీ అదికారంలో ఉండ‌డ‌మే. దీంతో ఆ కుటుంబం పోరాటాల‌కు చిరునామాగా మార‌లేక పోయింది. అయితే.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై మాత్రం.. త‌న‌దైన శాంతి యుత పంథాలోనే ముందుకు సాగింది. అదే.. చిత్తూరు జిల్లా పీలేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన న‌ల్లారి కుటుంబం.


తొలినాళ్ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా..న‌ల్లారి కుటుంబానికి నియోజ‌క‌వ‌ర్గంలోనేకాదు.. జిల్లాలోనూ మంచి పేరుంది. శాంతియుత రాజ‌కీయాలు.. ఆలోచనాత్మ‌క విధానాలతో ముందుకు సాగే కుటుంబంనే పేరు తెచ్చుకున్నారు. ఈ కుటుంబం నుంచి వార‌సులుగా రంగంలోకి వ‌చ్చిన న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి సుదీర్ఘ ప్ర‌స్థానం కాంగ్రెస్‌లో సాగింది. త‌ర్వాత‌.. ఆయ‌న ముఖ్య‌మంత్రి కూడా అయ్యారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. ఆయ‌న సోద‌రుడు.. కిషోర్ కుమార్ రెడ్డి 2014లో తొలిసారి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.


అప్ప‌ట్లో రాష్ట్ర విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా.. కిర‌ణ్‌కుమారెడ్డి స్థాపించిన‌.. జైస‌మైక్యాంధ్ర పార్టీ త‌ర‌ఫున కిషోర్ కుమార్‌రెడ్డి పీలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. అయితే.. అప్ప‌ట్లో ఆయ‌న ఓడిపోయారు. అనంతర ప‌రిణామాల్లో ఆయ‌న టీడీపీలోకి వ‌చ్చారు. 2019లో టీడీపీ టికెట్పై పోటీ చేసినా గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి పీలేరులో ఆయ‌న పోరు బాట ప‌ట్టారు. ఇదే న‌ల్లారి కుటుంబంలో తొలిసారి నాయ‌కుడు రోడ్డెక్క‌డం. వైసీపీ స‌ర్కారు ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను కిషోర్ కుమార్ అనేక సంద‌ర్భాల్లో ఎండ‌గ‌ట్టారు.


పుంగ‌నూరులో పెద్దిరెడ్డి అనుచ‌రులు.. చంద్ర‌బాబుపై విరుచుకుప‌డిన‌ప్పుడు.. ఆయ‌న‌పై రాళ్ల దాడి చేసిన‌ప్పుడు.. కిషోర్ కుమార్ పోరాట ప‌టిమ అంతా ఇంతా కాద‌ని నిరూపించుకున్నారు. ఇక‌, బాదుడే బాదుడు.. వంటి పార్టీ కార్య‌క్ర‌మాల‌ను కూడా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీని ప్ర‌చారం చేయ‌డం.. వైసీపీ విధానాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలోనూ ముందున్నారు. ప‌లితంగా.. తాజా ఎన్నిక‌ల్లో పీలేరు ప్ర‌జ‌లు తొలిసారి కిషోర్ కుమార్‌రెడ్డిని గెలిపించ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: