* లోకేష్ గ్రూప్‌లో కీల‌క నేత‌గా పాపుల‌ర్‌
* హ‌త్యాయ‌త్నం జ‌రిగినా ప్ర‌జా పోరాటంలో వెన‌క్కు త‌గ్గ‌ని నేత‌
* అవినీతి, అక్ర‌మాల‌కు వ్య‌తిరేకంగా గోపాల‌కృష్ణా రెడ్డి వార‌స‌త్వం నిల‌బెట్టాడుగా..

( చిత్తూరు - ఇండియా హెరాల్డ్ )

బొజ్జ‌ల ఫ్యామిలీ. ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర‌లేద‌నేది వాస్త‌వం. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస‌గా ఏడు సార్లు విజ‌యం అందుకుని.. తిరుగులేని రాజ‌కీయ నేత‌గా.. అటు అన్న‌గారి హ‌యాంలోనూ.. ఇటు చంద్ర‌బాబు హ‌యాంలోనూ మంత్రి పీఠం ద‌క్కించుకున్న నాయ‌కుడు.. బొజ్జ‌ల గోపాల కృష్ణారెడ్డి. అయితే.. ఆయ‌న 2019 ఎన్నిక‌ల‌కు ముందు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆయ‌న వార‌సుడిగా.. సుధీర్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశారు.


తండ్రి బాట‌లో ప‌య‌నిస్తూ.. ముందుకు సాగుతున్నారు. టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ గ్రూప్‌లో ప్ర‌ముఖ యువ నాయ‌కుడిగా సుధీర్ గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. తన తండ్రి ఎలా అయితే.. పేద‌ల‌కు చేరువ అయ్యారో.. ప్ర‌జ‌ల‌కు ఉత్త‌మ నాయ‌కుడిగా నిలిచారో.. ఇప్పుడు సుధీర్ కూడా.. అలానే చేరువ‌య్యారు. 2019 నుంచి ఆయ‌న‌.. ప్ర‌జ‌ల‌తోనే ఉన్నారు. అనేక పోరాటాలు చేశారు. ఒకానొక సంద‌ర్భంలో ఆయ‌న పై హ‌త్యా య‌త్నం జ‌రిగినా.. ఆయ‌న ప్ర‌జ‌ల‌ను విడిచి పెట్టకుండా ముందుకు సాగారు.


ప్ర‌జ‌ల కు ప్ర‌బుత్వానికి మ‌ధ్య వార‌ధిగా ఉండాల‌న్న త‌ప‌న‌తో.. శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి మండ‌లంలోనూ .. సుధీర్ త‌న‌దైన ముద్ర వేశారు. యువ‌త‌ను ప్రోత్స‌హించ‌డం.. యువ నాయ‌కుడిగా గుర్తింపు పొందడంలోనూ ముందున్నారు. అంతేకాదు.. సీనియ‌ర్ల నుంచి కూడా.. స‌ల‌హాలు స్వీక‌రిస్తూ.. వాటిని ఆచ‌రిస్తూ.. ముందుకు సాగారు. ముఖ్యంగా అవినీతి, అక్ర‌మాల‌కు దూరంగా ఉన్న త‌న తండ్రి వార‌స‌త్వాన్ని నిల‌బెట్ట‌డంలో సుధీర్ ముందున్నార‌నే చెప్పాలి.


2019లో ఓడిపోయినా.. ప‌ట్టుద‌ల‌తో చంద్ర‌బాబు చెప్పిన ప్ర‌తి కార్య‌క్ర‌మాన్నీ ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల నుంచి వైసీపీ వ్య‌తిరేక విధానాల వ‌ర‌కు అనేక రూపాల్లో ప్ర‌జ‌ల‌కు చేరువ య్యారు. నిరంత‌రం.. ప్ర‌జ‌ల్లోనే ఉన్నారు. ఒకానొక ద‌శ‌లో వైసీపీ అప్ప‌టి ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న రెడ్డి నుంచి హెచ్చ‌రిక‌లు వ‌చ్చినా.. త‌న బాడీ షేమింగ్ చేసినా.. సుధీర్ ప‌ట్టించుకోలేదు. ఫ‌లితంగా ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘ‌న  విజ‌యం ద‌క్కించుకున్నారు. రెడ్డి సామాజిక వ‌ర్గంలోనూ బ‌ల‌మైన ముద్ర వేసుకున్న యువ నాయ‌కుడు.. మున్ముందు ఎలా ఉంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: