ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐదు ముఖ్యమైన శాఖల మంత్రిగా ఏపీ అభివృద్ధిలో కీలక భూమిక పోషించనున్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా కీలక శాఖలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించి డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాత్రం ఏడాదిన్నరగా జీతాలు చెల్లించక పోవడంపై డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు. పంచాయితీరాజ్‌ శాఖలో జరిగిన వ్యవహారాలను నిగ్గు తేల్చాలని అధికారుల్ని ఆదేశించారు.పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిన్నరగా జీతాలు కూడా చెల్లించపోవడాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఆందోళన కలిగిస్తోందన్నారు. బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లకు పనులు ఎలా అప్పగించారని అధికారుల్ని ప్రశ్నించారు. అలాంటి కాంట్రాక్టర్లకు బిల్లులు ఏ మేరకు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.గ్రామాలవారీగా చేపట్టిన పనుల వివరాలు స్థానిక ప్రజలకు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని, పి.ఆర్. అండ్ ఆర్డీ, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఇంజినీరింగ్ విభాగాల సమీక్షలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.డేటా ఎంట్రీ ఆపరేటర్లు లాంటి చిరుద్యోగులకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా గత ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా ఆ చిన్నపాటి ఉద్యోగుల కుటుంబాలు వేదనతో ఉన్నాయని, ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు.

ప్రతి శాఖలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.సమీక్ష సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రివర్యులు బయలుదేరగా క్యాంపు కార్యాలయం వెలుపల వేచి ఉన్నవారిని చూసి వాహనం నిలిపారు.పి.ఆర్. ఇంజినీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేస్తున్న మహిళలు తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు రావలసిన జీతాలు చెల్లించే ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరారు. ఈ విధంగా బాధపడుతున్నవారు 129మంది ఉన్నామని, పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య ఖర్చులకు కూడా ఇబ్బందులుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.శాఖాపరమైన సమీక్షలు మొదలుపెట్టి, వివిధ పథకాల అమలు, నిధుల వినియోగంపై నివేదికలు పరిశీలిస్తున్నామని కచ్చితంగా ఈ అంశాన్ని చర్చిస్తామని హామీ ఇచ్చారు.

పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రహదారులు పాడైపోయిన తీరుపై చర్చించారు. ఏ మేరకు దెబ్బ తిన్నాయో, ఎంత కాలం నుంచి మరమ్మతులు చేయడం లేదో చెబుతూ, రోడ్ల కోసం కేటాయించిన నిధులను ఏం చేశారో తెలుపుతూ నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.ఏఐఐబీ నుంచి వచ్చిన రుణాన్ని వినియోగించుకోవడంలోనూ గత ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారులు వేస్తే ఆ మొత్తాన్ని రీ ఎంబర్స్ చేస్తామని ఏఐఐబీ చెప్పిందని తెలిసి పవన్ ఆశ్చర్యపోయారు.పంచాయితీరాజ్ ఇంజినీరింగ్ విభాగం చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడుతున్నారా లేదా అని ప్రశ్నించారు. బ్లాక్ లిస్టులో ఉన్నవారికి ఏ విధంగా పనులు అప్పగిస్తున్నారు, ఆ జాబితాలో ఉన్నవారికి బిల్లులు చెల్లింపులు ఎలా చేశారో తెలుపుతూ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: