- ఒక‌రు పొడంటే మ‌రొక‌రికి గిట్ట‌దు
- పాత నేత‌లు.. జంపింగ్ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త క‌రువు
- 8 ఎంపీ సీట్లు ఇచ్చినా 119 సీట్లు పోటీకి నేత‌లు లేరు

( ద‌క్షిణ తెలంగాణ - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణలో బీజేపి పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం పాలపొంగు పైకి వచ్చినట్టు ఒక్కసారిగా పుంజుకుంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా కింద పడిపోతుంది. తెలంగాణ బీజేపీలో లీడర్లు ఎక్కువైపోయారు. ఎవరికివారు ఆధిపత్య రాజకీయాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలలో కనీసం 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా పార్టీ తరఫున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు బీజేపీకి లేరని చెప్పాలి. గత ఐదేళ్లలో బీజేపీ తెలంగాణలో ఎంత హడావిడి చేసిందో చూసాము. తీరా చూస్తే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కేవలం 8 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడడం.. మరోసారి దేశవ్యాప్తంగా ప్రజలు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలని నిర్ణయించుకోవడంతో.. ఎప్పుడూ లేనట్టుగా ఏకంగా ఎనిమిది లోక్‌స‌భ‌ స్థానాలు గెలుచుకుంది.


తెలంగాణలో ఉన్న మొత్తం 17 లోక్‌స‌భ‌ స్థానాలలో ఎనిమిది చోట్ల అది కూడా అధికార కాంగ్రెస్‌తో సమానంగా గెలుచుకోవడం గొప్ప విషయం. తెలంగాణలో బీజీపీ పుంజుకోవటానికి ఇదే మంచి సమయం. అయితే పార్టీలో ఎవరికి వారు గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కు పడదు. అలాగే బండి సంజయ్‌కు మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ కు పొస‌గట్లేదు. అలాగే తన బలమైన వాగ్దాటితో మీడియాలో ముందుండే మెదక్ ఎంపీ రఘునందన్ అంటే కొందరికి నచ్చదు. ఆజాతశత్రువుగా అందరితో పేరు తెచ్చుకున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని సైతం కొందరు ఇష్టపడరు.


ఇలా ఎవరికు వారు ఒకరి పొడ అంటే మరొకరికి గిట్టకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో అధికార కాంగ్రెస్‌తో సమానంగా 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న బీజేపీ కష్టపడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి రావచ్చు. కానీ.. ఇక్కడ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో అంత సీన్‌ ఉంటుందా అన్న డౌట్లు ఉండనే ఉన్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్ పూర్తిగా డీలా పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు.. పార్లమెంటు ఎన్నికలు.. కేవలం ఐదు నెలల వ్యవ‌ధిలో పూర్తిగా డీలా పడింది. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎదిగేందుకు.. అధికారంలోకి వచ్చేందుకు ఇదే మంచి సమయం. మరి తెలంగాణ బీజేపీ లీడర్లు తమ మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అయినా అధికారంలోకి తీసుకొస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: