- కుమార్తె జైల్లో ఉంటే ప‌ల‌క‌రింపుకు వెళ్ల‌ని వైనం
- ఫామ్ హౌస్‌లో ఓమ్నీ కారు న‌డుపుతూ టైం పాస్‌
- ఎమ్మెల్యేలు, కీల‌క నేత‌లు పార్టీ వీడుతున్నా చోద్యం

( ఉత్త‌ర తెలంగాణ - ఇండియా హెరాల్డ్ )

రోమ్ నగరం తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తున్నాడ‌ట.. ఈ సామెత బిఆర్‌ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు అక్షరాలా వర్తిస్తుంది. మార్చి నెల నుంచి తీహార్ జైల్లో ఉన్న తన కుమార్తె కవితకు ధైర్యం చెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు వరుసగా వెళుతున్నారు. మొదటి రెండు నెలలు కవితను ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల పార్లమెంటు ఎన్నికలలో పార్టీ ఘోర పరాజ‌యం పాలయ్యింది. కనీసం ఒక్క ఎంపీ సీట్లు కూడా గెలవలేదు. పార్లమెంటు ఎన్నికలు ముగిశాక వారానికి ఒకసారి ఎవరో ఒకరు వెళ్లి కవితను పరామర్శించి వస్తున్నారు. ఒకసారి కేటీఆర్, మరోసారి మహిళ నేతలు.. ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత హరీష్ రావు కూడా వెళ్లి కవితను పరామర్శించారు. తీహార్ జైల్లో ఉన్న కవితకు ధైర్యం చెప్పి వచ్చారు.


కవిత అరెస్టు అయ్యాక ఒకసారి ఆమె తల్లి కూడా వెళ్లి పరామర్శించి వచ్చారు. అయితే కేసీఆర్ మాత్రం కుమార్తెను చూసేందుకు.. కుమార్తెను పరామర్శించేందుకు ఢిల్లీ వెళ్లలేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఢిల్లీ వైపు కూడా కేసీఆర్ చూడటం లేదు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆయన ప్రచారం చేశారు. అప్పటినుంచి పూర్తిగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. పార్టీ నేతలు ఎవరైనా కావాలి అనుకుంటే ఫామ్ హౌస్ కి వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు ఫాయ్‌ హౌస్ లో కేసీఆర్ వ్యవసాయంతో పాటు.. ఓమ్ని కార్లు నడుపుతున్నారు. ఓవైపు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతున్నారు. మరికొంద‌రు నేతలు బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు కూడా కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు చూస్తున్నారు.


ఇలాంటి టైంలో కేసీఆర్ పార్టీ మారవద్దని చేస్తున్న బుజ్జగింపులు కూడా ఫలించడం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే.. జైల్లో ఉన్న తన కుమార్తె కవిత గురించి ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయడం లేదు. ఢిల్లీలో ప్రత్యేకంగా ఒక పార్టీ ఆఫీస్ నిర్మించారు. ఆ పార్టీ ఆఫీసు కట్టడం ఆలస్యం అవుతుందని.. మరో బిల్డింగ్ కూడా లీజుకు తీసుకుని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వైపు వెళ్లటమే మానేశారు. భారీ ఖర్చుతో నిర్మించిన ఢిల్లీ సొంత కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించలేకపోయారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడంతో కెసిఆర్ అసలు ఢిల్లీ వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదని.. కవితను బెయిల్ పై బయటకు తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని బిఆర్ఎస్ వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: