పార్టీ అంటే.. వాడుకుని వ‌దిలేసే నాయ‌కుల‌కు కాంగ్రెస్‌లో కొద‌వ‌లేదు. ఆ మాటకొస్తే.. ఇత‌ర పార్టీల్లోనూ  ఉన్నారు. కానీ, సంక్లిష్ట స‌మ‌యాల్లో పార్టీని న‌మ్ముకున్న నాయ‌కులు అరుదుగా ఉంటారు. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌లో ఇలాంటి వారు ఉండేవారు. కానీ, త‌ర్వాత త‌ర్వాత కాలం మారింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ద‌న్నుగా నాయ‌కులు మారిపోయేవారు. కానీ, ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ మాత్రం చాలా కాలం కాంగ్రెస్‌లో ఇమిడిపోయారు. వైఎస్ శ్రీనివాస్‌గానేకాదు.. కాంగ్రెస్ శ్రీనివాస్‌గా కూడా ఆయ‌న గుర్తింపు తెచ్చుకున్నారు.


ఓ సంద‌ర్భంలో ఆయ‌న మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మీకు మంచి ఆఫ‌ర్ వ‌చ్చింది.. ఎందుకు వెళ్ల‌లేదు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ.. `కాంగ్రెస్ పార్టీ మంచి స్థాయిలో ఉన్నప్పుడు నేను  వ‌చ్చా ను. అప్పుడు పార్టీ కూడా.. నాకు అవ‌కాశం ఇవ్వ‌క‌పోయి ఉంటే.. ఈ స్థాయికి ఎదిగేవాడిని కాదు. అవ‌కాశాలు వ‌స్తాయి. పోతాయి. కానీ, మ‌న‌మే సృష్టించుకునే అవ‌కాశాలు కొంత కాలం నిల‌బ‌డ‌తాయి. కాంగ్రెస్‌లో అలాంటి అవ‌కాశాల‌ను నేను సృష్టించుకునే ఛాన్స్ ఉంది. ఎందుకు వెళ్లాలి?` అనినిర్మొహ‌మాటంగా చెప్పుకొచ్చారు.


టీడీపీలో చంద్ర‌బాబు హ‌వా జోరుగా ఉన్న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, ఆదిలాబాద్‌, విజ‌య‌వాడ‌, శ్రీకాకుళం స‌హా.. ప‌లు జిల్లాల్లో ఖాళీ అయిపోయింది. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం పార్టీకి చేటు తెస్తోంద‌ని గుర్తించిన డీఎస్‌.. త‌నంత‌ట తాను జోక్యం చేసుకుని పార్టీకి నివేదిక‌లు ఇచ్చారు. ఇలానే ఉంటే పార్టీని ప‌టిష్టం చేయ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పారు. త‌ర్వాత‌.. కాలంలో ఆయ‌నే పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. రెడ్డి సామాజిక వ‌ర్గం హ‌వాను ఎదిరించి.. బీసీల‌కు ప్రాధాన్యం పెంచారు.


అప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ అంటే.. రెడ్లు అనే మాట‌ను దాదాపు త‌గ్గించే ప్ర‌య‌త్నం చేసి.. ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాధాన్యం పెంచుతూ వ‌చ్చారు. అందుకే అప్ప‌టి వ‌ర‌కు దూరంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, బీసీలు కూడా.. 2004 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి.. కాంగ్రెస్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ముఖ్య‌మంత్రి పీఠంపై ఆశ ఉన్నా.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద‌యాత్ర త‌ర్వాత‌.. త‌న మ‌న‌సును మార్చుకుని.. పోటీలో లేన‌ని ప్ర‌క‌టించుకుని.. మార్గం సుగమం చేశారు. అంతేకాదు.. ముఖ్య‌మంత్రి రేసులో ఆనాడు ప్ర‌ముఖంగా ముందుకు వ‌చ్చిన‌.. పీజేఆర్‌ను సైతం.. ఒప్పించారు. ఇలా.. పార్టీ సంక్లిష్ట స‌మ‌యంలోనూ డీఎస్ వెన్నుద‌న్నుగా ఉన్నారు. పార్టీని గాడిలో పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: