- చంద్ర‌బాబు, వైఎస్సార్ ఫ్యామిలీల‌తో ద‌గ్గ‌ర బంధుత్వం
- ఎన్టీఆర్ రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేయ‌డంతో ఎంపీ
- బాబుతో విబేధించి వైసీపీలో చేరినా నో యాక్టివ్‌

( తిరుప‌తి - ఇండియా హెరాల్డ్ )

చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండ‌లంలోని మోదుగుల‌పాలెంలో జ‌న్మించిన మంచు భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు సినీ రంగంలో ప్ర‌వేశించి మోహ‌న్‌బాబుగా ఎలా ఎదిగారో మ‌నంద‌రికి తెలిసిందే. సినీరంగంలో స‌క్సెస్‌ఫుల్ హీరో, నిర్మాత‌గా ఉన్న టైంలోనే ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు, మోహ‌న్‌బాబుకు మంచి అనుబంధం ఉంది. అందుకే మోహ‌న్‌బాబును ఎన్టీఆర్ 1994లో భారీ మెజార్టీతో గెలిచి ఆయ‌న సీఎం అయ్యాక రాజ్య‌స‌భ‌కు టీడీపీ త‌ర‌పున నామినేట్ చేశారు. రాజ్యసభలో తన పదవీకాలాన్ని కొనసాగిస్తున్నప్పుడు మోహ‌న్‌బాబు 1996 నుంచి 1997 వరకు మానవ వనరుల అభివృద్ధిపై కమిటీ, పట్టణ మరియు గ్రామీణాభివృద్ధిపై కమిటీ మరియు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు కూడా ప‌నిచేశారు.


ఎన్టీఆర్ మ‌ర‌ణాంత‌రం చంద్ర‌బాబుతో కొంత కాలం ఉన్న ఆయ‌న త‌ర్వాత ఆయ‌న‌కు దూరం అయ్యారు. టీడీపీకి దూర‌మ‌య్యాక సినీ రంగంలో హీరోగా సినిమాలు చేశారు. మోహ‌న్‌బాబు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న‌ప్పుడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ క‌డ‌ప ఎంపీగా ఉండేవారు. ఆ టైంలోనే ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నిహిత సంబంధం కుదిరింది. ఈ క్ర‌మంలోనే అది త‌ర్వాత కాలంలో మోహ‌న్‌బాబు పెద్ద కుమారుడు, టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు, వైఎస్సార్ సోద‌రుడి కుమార్తెకు పెళ్లి సంబంధంతో ఈ రెండు కుటుంబాల మ‌ధ్య వియ్యంకులు కావ‌డానికి కార‌ణ‌మైంది.


టీడీపీకి దూర‌మ‌య్యాక వైఎస్సార్ ఫ్యామిలీతో బంధుత్వం క‌ల‌వ‌డంతో వైఎస్‌కు ద‌గ్గ‌ర‌గా ఆయ‌న ఉండేవారు. ఆ త‌ర్వాత 2014లో న‌వ్యాంధ్ర ఏర్ప‌డ్డాక ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. బాబుతో తీవ్ర‌గా విబేధించి త‌న పెద్ద కుమారుడు విష్ణుతో క‌లిసి వైఎస్‌. జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. 2019 ఎన్నిక‌ల టైంలో వైసీపీకి ఆయ‌న ప్ర‌చారం చేశారు. ఆ త‌ర్వాత వైసీపీలో ఆయ‌న్ను ప‌ట్టించుకోలేదు.. మ‌ధ్య‌లో కుటుంబంతో క‌లిసి మోడీని క‌లిసి రావ‌డంతో ఆయ‌న బీజేపీలో చేర‌తార‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది. ఏదేమైనా మోహ‌న్‌బాబు ఎన్టీఆర్ ద‌య‌తో ఓ సారి రాజ్య‌స‌భ స‌భ్యుడు అవ్వ‌డం మిన‌హా ఆయ‌న రాజ‌కీయంగా సాధించిన గొప్ప విజ‌యాలు అయితే లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: