![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/how-telugu-villain-kota-srinivasa-rao-became-an-mla-what-is-the-secret9e4f7689-91b6-4a12-835b-5d1810f2adbc-415x250.jpg)
- పొలిటికల్ రాజధాని విజయవాడ నుంచి అసెంబ్లీకి ఎన్నిక
- సింగిల్ టైం ఎమ్మెల్యేగా సరిపెట్టుకున్న వైనం..!
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
కోట శ్రీనివాసరావు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలోని కంకిపాడు గ్రామంలో 1947 జూలై 10న జన్మించారు. కోట తండ్రి సీతారామ ఆంజనేయులు వైద్యుడు. శ్రీనివాస మొదట్లో డాక్టర్ కావాలనే లక్ష్యం పెట్టుకున్నాడు కానీ నటనపై ఉన్న ప్రేమ కారణంగా చివరికి డాక్టర్ కాలేకపోయాడు. కోట చదువుకునే టైంలోనే కాలేజ్‌లో తన నటనా కెరీర్‌ను రంగస్థలంపై ప్రారంభించాడు. బీఎస్సీ చేసిన అనంతరం సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాస్ స్టేట్ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేశాడు. రుక్మిణితో ఆయనకు వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలతో పాటు ఓ కుమారుడు ఉన్నారు.
కోట శ్రీనివాస్ కుమారుడు కూడా కొన్ని సినిమాల్లో నటించినా 2010లో హైదరాబాద్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కోట తనయుడు జేడీ చక్రవర్తి సిద్ధంతో పాటు గాయం 2 సినిమాలో నటించారు. ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకున్న ఆయన రాజకీయాల్లోకి రావాలన్న కోరికతో ఉండేవారు. అప్పటికే తనతోటి నటుడు... బెస్ట్ ఫ్రెండ్ బాబూమోహన్ రాజకీయాల్లోకి వచ్చారు. చివరకు ఎన్టీఆర్ స్ఫూర్తి... చంద్రబాబు ప్రోత్సాహంతో పాటు వాజ్‌పేయ్ మీద ఉన్న ప్రేమతో బీజేపీ నుంచి 1999లో బెజవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రముఖ ఐలాపురం హోట్సల్ అధినేత ఐలాపురం వెంకయ్యపై ఆయన విజయం సాధించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. అదే టైంలో కోట బెస్ట్ ఫ్రెండ్, ఆయన తోటి నటుడు అయిన బాబూమోహన్ మెదక్ జిల్లాలోని ఆందోల్ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అలా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకేసారి అసెంబ్లీలో ఉండడం విశేషం.