కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అసలు సిసలైన పని మొదలు పెట్టిందనే తెలుస్తుంది. దాంట్లో భాగంగానే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్ చేత కాకినాడ లో ఆట మొదలెట్టించారు అనే తెలుస్తుంది.కాకినాడ పోర్టును మాజీ ఎమ్మెల్యే ద్యారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ కబ్జా చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన  వ్యాఖ్యలు చేశారు.కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆయన యాంకరేజ్ పోర్టు గోదాములను పరిశీలించారు. రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. రేషన్ బియ్యం నిల్వ ఉంచిన అశోక, హెచ్1 గోదాములను సీజ్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ద్వారంపూడి కుటుంబం పేద ప్రజల పొట్ట కొడుతోందని నాదెండ్ల ఆరోపించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని మంత్రి నాదెండ్ల తెలిపారు. రేషన్ బియ్యం ఎగుమతితో దేశానికి ద్వారంపూడి ఫ్యామిలీ చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటూ మండిపడ్డారు. రేషన్ బియ్యం షిప్పింగ్ నిలిపివేయాలని కాకినాడ పోర్టు అధికారులను ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోర్టు అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు ఘటనపై కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్, సివిల్ ప్లై ఎండీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశామని, అక్రమాలు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ మనోహర్ హెచ్చరించారు.

వైసీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా 36వేల 300 కోట్లు అప్పులు చేశారని, ఆ లెక్కలన్నీ బయటికి తీస్తామని క్లారిటీ ఇస్తున్నారు మనోహర్. దీంతో మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఇరుక్కోవడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.మొత్తం మీద ద్వారంపూడి మీద ఫోకస్‌ పెట్టిన మంత్రి పక్కా లెక్కలు, ఎక్కాలతోనే ఫీల్డ్‌లోకి దిగినట్టే కనిపిస్తోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు.మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలోనే రెండో రోజు అయిన శనివారం విస్తృత సమీక్షలు, తనిఖీలు చేపట్టారు. పీడీఎస్ బియ్యంకు సంబంధించిన అక్రమాలు వెలుగులోకి తెచ్చేందుకు అధికారులను దగ్గరుండి మరీ వారినుంచి సమాచారం రప్పించి ఆపై ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. మొత్తానికి అక్కడే రెండు రోజులు ఉన్నందుకు 7615 మెట్రిక్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు మంత్రి తెలిపారు.అయితే కంచే చేను మేసిన చందంగా కొందరు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని అక్రమార్కులకు చేరవేయడం ద్వారా జాగ్రత్తపడుతున్నారని, ఈ చర్యలను గుర్తించిన మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా హెచ్చరించారన్న టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా కాకినాడ కేంద్రంగా పీడీఎస్ బియ్యం మాటున జరుగుతోన్న అక్రమాలు మాత్రం నిగ్గుతేల్చే పనిలో సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ సారధ్యంలో పడ్డారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: