-దర్శకరత్నగా ఎంతో గుర్తింపు..
-గిన్నిస్ రికార్డు సాధించిన గొప్ప వీరుడు..
- సినిమాల నుంచి పాలిటిక్స్ వరకు  దాసరి కష్టాలు.!
 
తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరి ప్రయాణం చాలా ప్రత్యేకం. ఆయన ఇండస్ట్రీలో ఏది చేసినా  చాలా స్పెషల్ గా ఉండేది. దాసరి నారాయణరావు  అరటిపళ్ళ అమ్మకం నుంచి మొదలు  కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా  ఎదిగారు. ఇంతటి స్థాయికి ఆయన రావడానికి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అలాంటి దాసరి కేవలం సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిలో దూసుకెళ్లారు. మరి దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి ఎవరికీ తెలియని కొన్ని వివరాలు తెలుసుకుందాం.
 దాసరి జననం:
దాసరి నారాయణరావు 1947 మే 4వ తేదీన పశ్చిమగోదావరి పాలకొల్లులో సాయిరాజ్,మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు. దాసరి పుట్టిన సమయంలో వారి కుటుంబానికి ఆస్తులు బాగానే ఉండేవి. వాళ్ల నాన్న పొగాకు వ్యాపారం చేసేవాడు.  కానీ దాసరి సిక్స్త్ క్లాస్ చదువుతున్న సమయంలో పొగాకు వ్యాపారంలో తీవ్రంగా నష్టాలు రావడంతో వీరి జీవితం దుర్భర స్థితిలోకి చేరింది. కనీసం తిందామంటే తిండి లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దాసరి చదువు మానేయాల్సి వచ్చింది. కానీ చివరికి దాసరి కి టీచర్ మరియు తన తోటి విద్యార్థుల సహకారంతో  మళ్లీ బడిబాట పట్టారు . అలా టెన్త్ క్లాస్ పూర్తి చేసి  ఇంటర్మీడియట్  లో చేరారు.  ఆ సమయంలోనే దాసరి నారాయణరావు ఓవైపు అరటిపళ్ళు అమ్ముకుంటూ తన చదువుకు సంబంధించిన ఖర్చులను వెల్లదీసుకునేవారు. ఇక అప్పటినుంచి ఆయనకు విద్యార్థి ఉద్యమాలు చేయడం, ప్రశ్నించడం అలవాటైపోయింది. ఓవైపు రంగస్థలంలో నాటకాలు చేస్తూ  మరోవైపు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూ,  ఇంకోవైపు పార్ట్ టైం జాబులు చేస్తూ తన పూర్తిస్థాయి స్టడీని పూర్తి చేశారు. ఆ విధంగా ఆయన మొదటిసారి చెన్నై వెళ్లి కమెడియన్ కు సపోర్ట్ పాత్రలో చేసి  అక్కడి నుంచి తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టారు.

 
 సినీ జీవితం:
 హీరోలతో సమానంగా దర్శకులకు కూడా మంచి పేరు తీసుకొచ్చిన వారిలో దాసరి నారాయణరావు ఒకరు. ఎన్టీఆర్,ఏఎన్నార్ వంటి స్టార్ నటులను కూడా  హీరోలుగా పెట్టి ఇండస్ట్రీ రికార్డులు కొట్టారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరో లేకుండా సినిమాలు తీయడాన్ని  మొదలుపెట్టారు దాసరి. అందులో సూపర్ హిట్ అయిన సినిమా ఒసేయ్ రాములమ్మ.  ఈ సినిమా ద్వారా విజయశాంతికి మంచి పేరు తీసుకురావడమే కాకుండా లేడీ ఓరియంటెడ్ పాత్రలు కూడా సినిమాల్లో ఉంటాయని మొదటిసారి చూపించిన వ్యక్తిగా దాసరికి పేరు వచ్చింది. ఈ విధంగా సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా,  ప్రొడక్షన్ బాయ్ గా.. నటుడిగా.. రచయితగా..దర్శకుడిగా.. నిర్మాతగా.. చిత్ర పరిశ్రమలో ఉండే అన్ని విభాగాల్లో ఈయన పనిచేశారు. ఈ విధంగా 150 కి పైగా సినిమాల్లో పనిచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాడు. దాదాపు 220కి పైగా చిత్రాలకు రచయితగా చేశారు. ఈ టైంలోనే కొత్త కొత్త నటులను, రచయితలను, డైరెక్టర్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు దాసరి నారాయణరావు.


 రాజకీయ జీవితం:
 ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు పొందిన దాసరి నారాయణరావు  అప్పటి కాంగ్రెస్ అధినాయకుడు రాజీవ్ గాంధీ పిలుపుమేరకు 1989లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ నుంచి కాస్త దూరంగా వెళ్లి 1997 దశకం చివరిలో  తెలుగు తల్లి అనే రాజకీయ పార్టీ స్థాపించారు. ఈ పార్టీకి అప్పట్లో మంచి ఆదరణ లభించింది.  కానీ ఆయనకు సమయం దొరకక పార్టీని లీడ్ చేయలేక చివరికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ టైంలోనే రాజ్యసభకు ఎంపికై  బొగ్గు గనుల శాఖ మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. అలా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పని చేసిన దాసరి నారాయణరావు చివరికి మూత్రపిండాల సమస్యతో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: