•తెలుగు జాతి ముద్దు బిడ్డ.. తెలుగోడు కాలర్ ఎగరేసే నేత ఎన్టీఆర్!
•రాజకీయాల్లో కూడా నెంబర్ వన్ గా నిలిచిన ఏకైక హీరో!
•ముఖ్యమంత్రిగా ఆంధ్రులకు ఎనలేని సేవలందించిన మహా నేత ఎన్టీఆర్!


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్): తెలుగు జాతి ముద్దు బిడ్డ.. ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసేలా చేసిన అన్నగారు నందమూరి తారక రామారావు ఒక గొప్ప మహా నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ ఇంకా గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించారు. తెలుగు సినీ పరిశ్రమకి ఎన్నో సేవలని అందించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయారు ఎన్టీఆర్. హీరోగా ఎన్నో దశాబ్దాలు నెంబర్ వన్ హీరోగా దూసుకెళ్లిన ఎన్టీఆర్.. రాజకీయాల్లో కూడా నెంబర్ వన్ అయ్యి తెలుగోడు కాలర్ ఎగరేసేలా చేశారు.రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో  రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా ఏకంగా 7 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి దాకా అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు.


పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెట్ వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించారు. దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవారు. ఆ వ్యాన్ కి అప్పట్లో సూపర్ క్రేజ్ ఉండేది. ఆయన దాన్ని "చైతన్యరథం" అని అనేవారు. ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం రాయించారు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తిగా నిలిచింది.అలా ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించారు. ఆ చైతన్యరథమే ప్రచార వేదికగా, ఆయన నివాసంగా మారిపోయింది. ఎన్టీఆర్ ఒక శ్రామికుడివలె ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసారు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసి ప్రచార ప్రభంజనం సృష్టించి సీఎం గా ప్రజలని చక్కగా పాలించిన రియల్ హీరోగా ఎన్టీఆర్ తెలుగు జాతి గుండెల్లో చిరకాలం పాటు నిలిచిపోయారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: