ఏపీలో అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా గా ఇదే అంశంపై ఓ ప్రకటన చేశారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. విశాఖపట్నంలో పర్యటించిన ఆయన కొద్దిగా ఆలస్యమైనా స్కీమ్‌ను అమల్లోకి తీసుకువస్తామన్నారు. విశాఖపట్నం నుంచే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం స్కీమ్‌ ప్రారంభిస్తామన్నారు. ఈ స్కీమ్‌ అమలు విధివిధానాలపై తెలంగాణ, కర్ణాటకలో అధ్యయనం చేస్తామన్నారు మంత్రి మండిపల్లి.ఉద్యోగులు, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ ప్రక్షాళనకు సంకీర్ణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందన్నారు.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి తీరుతామని, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని వెల్లడించారు. పక్క రాష్ట్రాల్లో ఫ్రీ బస్సు స్కీమ్ ఎలా అమలవుతుందో అధ్యయనం చేస్తామని, ఆ తర్వాత ఏపీలో అమలు చేస్తామన్నారు. నెల రోజులు ఆలస్యమైనా.. ఫ్రీ బస్సు పథకాన్ని ఏపీలో పక్కాగా అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకల్లో మహిళల కు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి స్కీమ్‌ పేరుతో అమల్లో ఉంది. ఆధార్ కార్డు ప్రామాణికంగా ఈ స్కీమ్‌ను రెండు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. తెలంగాణలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆధార్‌ కార్డు ఉంటే రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇందులో భాగంగా మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తారు. తెలంగాణలో డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు.
అయితే తెలంగాణ, కర్ణాటకలోనూ ఈ పథకంపై విమర్శలు వస్తున్నాయి. సరిపడా బస్సులు వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై ఎలాంటి నిబంధనలు పెడతారనేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: