ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. మ‌రో 48 గంట‌ల్లో నోటిఫికేష‌న్ రానుంది. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీల వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. కొన్నాళ్ల కింద‌ట వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న ఇద్ద‌రిపై శాస‌న మండ‌లి చైర్మ న్ అన‌ర్హ‌త వేటు వేయ‌డంతో ఇప్పుడు ఆయా స్థానాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. వైసీపీ శాస‌న మండ‌లి స‌భ్యులుగా ఉన్న మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌, సి. రామ‌చంద్ర‌య్య‌లు.. ఎన్నిక‌లకు ముందు పార్టీ మారిన విష‌యం తెలిసిందే. వారు  అప్ప‌ట్లోనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆగ్ర‌హించిన వైసీపీ వారిపై అన‌ర్హ‌త వేటు చేసింది.


దీంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యారు. మండ‌లిలో వైసీపీ నాయ‌కుడు, మోషేన్ రాజు చైర్మ‌న్‌గా ఉండ‌డంతో అన‌ర్హ‌త వేటు వేయ‌డం.. ఈజీ అయిపోయింది. ఇక‌, ఇప్పుడు వీటికి  ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు.  అయితే.. ఈ రెండు స్థానాలు కూడా.. టీడీపీ కూట‌మికే ద‌క్క‌నున్నాయ‌ని అన‌డంలో సందేహం లేదు. ఎందుకంటే.. ఈ రెండు మండలి స్థానాలు కూడా.. ఎమ్మెల్యే కోటా స్థానాలు. అంటే.. స‌భ‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఓటేయ‌డం ద్వారా వీరిని ఎన్నుకోనున్నారు. గ‌తంలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యే బ‌లం ఉండ‌డంతో ఎన్నిక ఈజీ అయిన‌ట్టే.. ఇప్పుడు కూట‌మికి 164 మంది స‌భ్యులు ఉండ‌డంతో కూట‌మికే ఈ రెండు సీట్లు ద‌క్క‌నున్నాయి.


ఇదిలావుంటే.. ఎవ‌రిని ఈ రెండు ప‌ద‌వుల‌కు ఎంపిక చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నుంచి పార్టీ నాయ‌కుల వ‌ర‌కు కూ డా.. అంద‌రూ పింఛ‌న్ల పంపిణీపైనే దృష్టి పెట్టారు. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ పింఛ‌న్ల పంపిణీనే ప్ర‌ధానంగా తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై ఇంకా దృష్టి పెట్ట‌లేద‌ని స‌మాచారం. అయితే.. ఇప్ప‌టికే ఖ‌రారైంద‌నిపార్టీలోని మ‌రో వ‌ర్గం చెబుతోంది. దీంతో ఎవ‌రికి ఈ సీట్లు ద‌క్కుతున్నాయ‌నేది ఆస‌క్తిగా మారింది. ఇక‌, పోటీలేని కార‌ణంగా.. ఖ‌చ్చితంగా విజ‌యం ఖాయం కావ‌డంతో నేత‌లు కూడా పోటీ ప‌డుతున్నారు.  


జూలై 2వ తేదీన నోటిఫికేష‌న్‌, అదే రోజు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ఉంటుంద‌ని తెలుస్తోంది. నామినేష‌న్ల ప‌రిశీల‌న‌  జూలై 3వ తేదీన ఉంటుంద‌ది, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. జులై 5గా ఉంటుంద‌ని తెలుస్తోంది. 11 మంది స‌భ్యులున్న వైసీపీ కూడా బ‌రిలోకి దిగితే జూలై 12న పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ చేప‌డ‌తారు. అయితే.. వైసీపీ ఈ ఎన్నిక‌ల‌కు దూరంగా నే ఉండ‌నుంది. ఎందుకంటే.. అన‌వ‌స‌రంగా పోటీ ప‌డి.. అభాసుపాల‌వ‌డం ఎందుకనేది.. పార్టీ నాయ‌కులు కూడా భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: