ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 70 వేల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో జూలై 1 నుంచి ప‌ర్య‌టించ‌నున్నారు. వాస్త‌వానికి ఆయ‌న గెలిచిన త‌ర్వాత‌, మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. రెండు సార్లు పిఠాపురం ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి షెడ్యూల్ ప్ర‌క‌టించారు. జూన్‌ 25నే ఆయ‌న పిఠాపురం వెళ్తార‌ని తొలుత జ‌న‌సేన పార్టీ ప్ర‌క‌టించింది. త‌ర్వాత‌.. వారాహి అమ్మ‌వారి దీక్ష ఉన్న నేప‌థ్యంలో 27 నుంచి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తార‌ని షెడ్యూల్ మార్చారు.


తాజాగా ఇప్పుడు ఆయ‌న‌ జూలై 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ప‌వ‌న్ పిఠాపురంలో ప‌ర్య‌టించనున్నారు. మూడు రోజులు కూడా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటారు. ఇక‌, ఈ ప‌ర్య‌ట‌న‌లో బ‌హిరంగ స‌భ‌ల్లోనూ పాల్గొన‌నున్నారు. పిఠాపురం ప్ర‌జ‌లు త‌న‌ను గెలిపించినంద‌ను కృత‌జ్ఞ‌త‌గా వారికి ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలప‌నున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల నుంచి వారి వ్య‌క్తిగ‌త‌, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పైనా ద‌ర‌ఖాస్తులు తీసుకుంటారు. కీల‌క స‌మ‌స్య‌ల‌ను క్షేత్ర‌స్తాయిలో ప‌ర్య‌టించి ప‌రిశీలిస్తారు. మొత్తం మూడు రోజుల ప‌ర్య‌ట‌న  నిర్వ‌హిస్తున్న‌ట్టు పార్టీ ప్ర‌క‌టించింది.


తొలి రోజు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు. ఇదేస‌మ‌యంలో పార్టీ నాయ‌కుల‌తోనూ భేటీ అవుతారు. అయితే.. ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న ఎలా రియాక్ట్ అవుతార‌నేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. అనేక స‌మ‌స్య‌లు తూర్పులో ఆయ‌న గతంలోనే ప్ర‌స్తావించారు. ర‌హ‌దారులు బాగోలేద‌ని.. పిఠాపురాన్ని మోడ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దు తాన‌ని చెప్పారు. అదేవిధంగా ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రిస్తాన‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ కోసం ఇక్క‌డి ప్ర‌జ‌లు భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. పైగా ఆయ‌న తొలి సారి వ‌స్తుండ‌డం కూడా.. ఆస‌క్తిగా మారింది.


ఇదే ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప‌వ‌న్ క‌ల్యాణ్ సమీక్షిస్తారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం నిర్వ‌హించి.. నిపుణుల నుంచి స‌ల‌హాలు తీసుకుంటారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల నుంచి మూడు రోజుల పాటు స‌మ‌స్య‌ల‌పై అర్జీలు తీసుకోనున్నారు. ఇది ఇప్ప‌టికే పార్టీ కార్యాల‌యంలో కొన‌సాగుతోంది. కానీ, ఇప్పుడు ప్ర‌జ‌లు త‌క్ష‌ణ ప‌రిష్కారాలు.. స‌మ‌స్య‌ల‌కు స్పంద‌న కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చి వెళ్తారా?  లేక స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: