రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఒకప్పుడు ప్రజల సెంటిమెంట్. పునర్విభజన చట్టంలో ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొన్నారు. అయితే తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం అటకెక్కింది. మరోసారి ప్రత్యేక హోదా ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దానికి ప్రధానమైన కారణం బీహార్. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వంలో జేడీయూ, టీడీపీ అతి పెద్ద పార్టీలుగా ఉన్నాయి. బీజేపీ ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు సొంతంగా బలం కలిగి లేదు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల సహకారంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో బీహార్‌కు చెందిన నేతలు తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. విభజనతో ఆర్థికంగా నష్టపోయిన ఏపీ కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తోంది. అయితే ప్రస్తుం ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన జేడీయూ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది. దానిని బీజేపీకి పంపింది. ప్రస్తుతం ఆ పార్టీపై ఆధారపడ్డ బీజేపీ బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. అయితే జేడీయూ కంటే ఎక్కువ మంది ఎంపీలున్న టీడీపీ ప్రస్తుతం సైలెంట్‌గా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదే సమయంలో టీడీపీపై ఒత్తిడి పెంచేలా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

గతంలో 2014, 2019లో బీజేపీ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగల స్థానాలను సంపాదించింది. ప్రస్తుతం ఆ పార్టీ కేవలం 240 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో మేజిక్ ఫిగర్ 272 సొంతంగా బీజేపీ దాటలేదు. అందుకే టీడీపీ, జేడీయూ ఇతర పార్టీలతో కలిసి ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతోంది. ఆ రెండు పార్టీలు ప్రస్తుతం మద్దతు ఉపసంహరించుకుంటే బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది. ఈ తరుణంలో బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కీలకమైన డిమాండ్ పెట్టారు. అయితే కేంద్రంలో టీడీపీ మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తున్నా, ఆ పార్టీ ప్రత్యేక హోదాను ఎందుకు డిమాండ్ చేయడం లేదని షర్మిల ప్రశ్నిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిపి ప్రస్తుతం 18 మంది ఎంపీల బలం బీజేపీకి ఉంది. అయినా ప్రత్యేక హోదా అడగడం లేదని షర్మిల నిలదీస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ప్రత్యేక హోదా గురించి టీడీపీపై ఆమె ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే 'బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోడీ ముందట డిమాండ్ పెడితే.. ఏపీకి హోదాపై చంద్రబాబు గారు కనీసం నోరు విప్పడం లేదు. మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న మీరు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా ? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా ? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా ?  హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు ? మోసం చేసిన మోడీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు ? ప్రత్యేక హోదాపై  మీ వైఖరి ఏంటో  చెప్పాలని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని, చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక ప్యాకేజీలు కాదు...రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని అని గుర్తు చేస్తున్నాం.' అని ఆమె ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: