ఎక్కడైనా అధికారం కోల్పోయిన పార్టీ నుంచి అధికారంలో ఉన్న పార్టీలోకి ఎమ్మెల్యేలు వలసలు పోతున్నారు. ప్రభుత్వంలో ఉంటే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించుకోవచ్చనో లేక ప్రతిపక్షంలో ఉండి లేని పోని ఇబ్బందులు ఎందుకో అని కొందరు ఇలా జంపింగ్ చేస్తుంటారు. అప్పటి వరకు తమ ప్రత్యర్థి పార్టీ నాయకులను దూషించే నేతలు ఒక్క రాత్రిలోనే కండువా మార్చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు, ఎన్నికలకు తర్వాత ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ ఆపరేషన్ కాంగ్రెస్ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో మొదటిగా దానం నాగేందర్‌ను కాంగ్రెస్ లోకి తీసుకున్నారు. అదే సమయంలో సీనియర్ నేత కడియం శ్రీహరిని, తర్వాత కేకే, పోచారం శ్రీనివాస రెడ్డిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. వారికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు 39 మంది సభ్యుల బలం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్‌లో చేరారు. రానున్న మరికొన్ని రోజుల్లో భారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. అయితే పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలను కేటీఆర్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. ఐటీ మంత్రిగా తనదైన ముద్ర వేసుకుంటూనే, పార్టీ బాధ్యతలను కూడా మోశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా క్షేత్ర స్థాయిలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన నాయకత్వ ప్రతిభ పట్ల సందేహాలు వస్తున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యేలు చేజారి పోతున్నా ఆయన పట్టనట్టు ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయి. ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారాక కేసీఆర్ స్పందించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వెంటనే ఫామ్ హౌస్‌కు రప్పించుకుని మాట్లాడారు. ఇది జరిగిన తర్వాత రోజే కాలె యాదయ్య కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సైతం సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. మరికొందరు ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలిసి ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను, నేతలను కట్టడి చేయడంలో కేటీఆర్ విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: