కూటమి ఘనవిజయం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 12న ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు. ఖాళీ అయిన రెండు స్థానాలలో ఒకటి జనసేనకు కేటాయించగా.. టిడిపి నుంచి పార్టీ సీనియర్ నేత సీ. రామచంద్రయ్యకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. వాస్తవానికి రామచంద్రయ్య ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. 40 సంవత్సరాల కెరీర్‌లో ఆయన అటూ.. ఇటూ తిరిగి పలు పార్టీలు మారి చివరికి ఇప్పుడు తన సొంత గూటికే చేరుకున్నారు.


అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం గుడ్లవారిపల్లి కి చెందిన రామచంద్రయ్య చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపనతో ఆ పార్టీలో చేరిన ఆయన 1985లో కడప నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1986 లో 20 సూత్రాల అమలు శాఖకు మంత్రిగా కూడా పనిచేశారు. అలా ఎన్టీఆర్ ప్ర‌భుత్వం లోనే ఆయ‌న మంత్రి అయ్యారు. ఆ తర్వాత టీడీపీ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైన రికార్డు సృష్టించారు. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా సేవలందించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో చేరిన రామచంద్రయ్య మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.


ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆ పార్టీలో చేరిన ఆయన 2011లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018లో వైసీపీలో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2021 మార్చి 8న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఈ ఏడాది జనవరి 3న వైసీపీకి రాజీనామా చేసి తన సొంత పార్టీ టీడీపీలో చేరారు. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీ ప‌ద‌వి మూడేళ్లు పూర్తయింది. ఇప్పుడు మరోసారి టీడీపీ నుంచి కూడా ఆయనకే అవకాశం ఇవ్వడంతో మరో మూడేళ్లపాటు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: