ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కోలుకోవడానికి జగన్ కు చాలా టైం పట్టేలా కనిపిస్తోంది. పార్టీ ఓడిపోయాక కొద్ది రోజులు ఎవరితో కలిసేందుకు ఇష్టపడని వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి జగన్.. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, పార్టీ నుంచి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలతో సమావేశం పెట్టారు. అంత బాగా కష్టపడి పని చేస్తే ఎందుకు ఓడిపోయామో తనకే అర్థం కావడం లేదని.. ఒకానొక టైంలో రాజకీయాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదాం అనుకున్నాను అని కూడా చెప్పినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఏనాడు తన సొంత నియోజకవర్గ పులివెందుల గురించి పట్టించుకోని జగన్.. ఐదు రోజులు అక్కడ విశ్రాంతి తీసుకోవాలని వెళ్లారు.


రెండు రోజులకే స్థానిక నేతలు.. పులివెందుల మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు తాము చేసిన పనులకు బిల్లులు రాలేదని జగన్ చుట్టూ ముట్టేశారు. ఉక్కిరిబిక్కిరి అయిన జగన్ రెండు రోజులకే పులివెందుల పర్యటన బంద్ చేసుకొని బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ లో రెస్ట్ తీసుకుని.. మంగళవారం తిరిగి తాడేపల్లికి వస్తున్నారు. జగన్ తిరిగి తాడేపల్లికి వస్తుండడంతో భారీగా జన సమీకరణ చేయాలని కృష్ణాజిల్లా నేతలకు పార్టీ పెద్దలనుంచి సందేశాలు వచ్చాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు జగన్ ఎయిర్ పోర్ట్ కి వస్తారని.. జనం బాగా కనిపించేలా చూడాలని ఆదేశాలు రావడంతో కృష్ణాజిల్లా వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ ఘోరంగా ఓడిపోయే నెల రోజులు కూడా కాలేదు. ఇప్పుడు రమ్మంటే ఎవరు వస్తారని వారంతా నిట్టూరుస్తున్నారు.


చివరకు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. వాట్సాప్ గ్రూపులో మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారట. పార్టీ నేతలు కాదు కదా చివరకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఏయిర్‌పోర్టు దగ్గర జగన్‌ను రిసీవ్ చేసుకునేందుకు వెళ్లడానికి కూడా ఇష్టపడటం లేదని.. కృష్ణా జిల్లా వైసీపీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. అసలు జనాలు రాకపోతే జగన్ ఏపీకి వస్తే ఎవరూ పట్టించుకోవటం లేదన్న సంకేతాలు మీడియాలోకి, ప్రజల్లోకి వెళ్లిపోతాయన్న ఆందోళనలు ఉన్నాయి. అందుకే జగన్ కు గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికేందుకు జనాలను బలవంతంగా అయినా తీసుకురావాలని.. కృష్ణా జిల్లా వైసీపీ నేతలకు టార్గెట్లు పెట్టినట్లు తెలుస్తోంది. కృష్ణా వైసీపీ నేతలు మాత్రం ముందే చేతులెత్తేసిన పరిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: