ఆంధ్రప్రదేశ్‌లో అధికారం మారింది. జగన్ స్థానంలో.. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. గతంలో జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే చాలా చోట్ల పసుపు రంగులు మార్చి వేసి వైసీపీ రంగులు వేశారు. పలు ప్రభుత్వ కార్యాలయాలపై సైతం మూడు రంగులతో కూడిన వైసీపీ జెండా రంగులు వేసి పాలన ప్రారంభించారు. ఎక్కడా కూడా తెలుగుదేశం ముద్ర పసుపు రంగు అనేది కనపడకుండా చేశారు. ఇప్పుడు అధికారం మారడంతో తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎక్కడిక‌క్కడ రంగులు మార్చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైసీపీ జండా రంగును తొలగించి దాని స్థానంలో పసుపు రంగు వేస్తున్నారు.


ఈ క్రమంలోనూ పలు ప్రభుత్వ పథకాల పేర్లను కూడా మారుస్తున్నారు. ప్రజలకు పంపిణీ చేసే సరుకులపై జగన్ బొమ్మ ఉంటే దానిని తొలగించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే రేషన్ సరుకులు పంపిణీ చేసే వ్యాన్ల‌ పై మాజీ ముఖ్యమంత్రి జగన్ బొమ్మలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించిన కొందరు అధికారులు పాటించడం లేదు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్ ఎన్‌పేట మండలం ఎంబ‌రం గ్రామంలో సోమవారం పింఛన్లు పంపిణీ చేసేందుకు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వచ్చారు. అదే సమయంలో రేషన్ సరుకుల వాహనంపై జగన్ బొమ్మ ఉంది.


అది చూసిన ఎమ్మెల్యే కారు దిగి వాహనం వద్దకు వెళ్లారు. దొంగల బొమ్మలతో సరుకులు ఎలా పంపిణీ ?చేస్తారని రెవెన్యూ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ గ్రామంలో ఇంకా పాత ముఖ్యమంత్రి బొమ్మతో రేషన్ అందిస్తుంటే.. మీరంతా ఏం చేస్తున్నారని ఆయన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పై మండిపడ్డారు. అక్కడితో ఆగని ఎమ్మెల్యే గోవిందరావు.. వెంటనే మంత్రి అచ్చెం నాయుడు కి ఫోన్ చేసి తహసిల్దారు రాణి అమ్మాజీ తో మాట్లాడించారు. వెంటనే ఎండిఎం ఆపరేటర్ రేషన్ డీలర్ ను తొలగించాలని.. రెవెన్యూ సిబ్బందికి మెమోలు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దీనిపై జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామని తహసిల్దారు ఎమ్మెల్యేకు నచ్చచెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: