బొత్స సత్యనారాయణ.. విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ గత వైసీపీ ప్రభుత్వం లో మంత్రిగా పనిచేశారు. ఇంకా చెప్పాలి అంటే ఉమ్మడి విజయనగరం జిల్లాను బొత్స ఫ్యామిలీ రాజకీయంగా కబ్జా చేసి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. చీపురుపల్లి నుంచి బొత్స ఎమ్మెల్యే, గజపతినగరం నుంచి బొత్స సోదరుడు అప్పల నరసయ్య ఎమ్మెల్యే, నెల్లిమర్ల నుంచి బొత్స మేనకోడలి భర్త అప్పలనాయుడు ఎమ్మెల్యే.. విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా బొత్సకు సమీప బంధువు. గత ఎన్నికలలో ఈ నలుగురితో పాటు.. చాలదు అన్నట్టుగా బొత్స భార్య భర్త ఝాన్సీని విశాఖపట్నం నుంచి పార్లమెంటుకు పోటీ చేయించారు. కీలకమైన విజయనగరం జిల్లాతో పాటు.. ఇటు విశాఖ నగరం మీద కూడా గ్రిప్ తెచ్చుకోవాలని బొత్స ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది.


ఇక విజయనగరం జడ్పీ చైర్మన్‌గా బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే గత 15 సంవ‌త్స‌రాలుగా విజయనగరం జిల్లా రాజకీయాలను బొత్స ఫ్యామిలీ పూర్తిగా శాసిస్తూ వచ్చింది. గత ఐదేళ్లలో అయితే వారికి అస్సలు తిరుగులేదు. అయితే ఈ ఎన్నికలకు ముందు బొత్స‌కు ఆరోగ్యం అంతగా సహకరించలేదు. ఎన్నికల్లో తన పోటీ చేయనని.. తనను రాజ్యసభకు నామినేట్ చేయాలని కూడా బొత్స జగన్‌ను వేడుకున్నా జగన్ కనికరించలేదు. ఈ ఎన్నికలలో పోటీ చేయాలనే చెప్పడంతో పాటు బొత్స‌కు ఇష్టం లేకపోయినా భార్య ఝాన్సీని సైతం విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయించారు. దీంతో బొత్స అటు చీపురుపల్లిలోనూ.. ఇటు విశాఖపట్నం పార్లమెంటులోను.. రెండు చోట్ల సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు.


చీపురుపల్లిలో గట్టి పోటీ ఇచ్చి.. కళా వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. ఇక ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బొత్స క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బొత్స‌తో పాటు ఆయన భార్య ఝాన్సీ కూడా ఇక ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో లేరు. ఇదిలా ఉంటే అనూహ్యంగా బొత్స సోదరుడు గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య కూడా ఇకపై రాజకీయాల్లో పోటీ చేయకూడదని ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో కంటిన్యూ కాలేమన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఫ్యూచ‌ర్ పొలిటిక‌ల్ ఆశలు ఉన్నవారిలో బొత్స మేనల్లుడు చిన్న శ్రీను తెరమీదకి రానున్నారు. అలాగే నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు కూడా రాజకీయంగా కంటిన్యూ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఏది ఏమైనా బొత్స‌ ఫ్యామిలీ రాజకీయాలకు దాదాపు గుడ్ బై చెప్పేసినట్టు.. విజయనగరం జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: