వైసీపీ ముఖ్య నేతలలో ముందు వరుసలో ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇంకా చెప్పాలంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు నెంబర్ టు పొజిషన్ లో ఆయనది. ఒక చిత్తూరే కాకుండా రాయలసీమతో పాటు పలు ఇతర జిల్లాల్లో కూడా ఆయన చెప్పిన వారికే గత ఎన్నికల్లో టికెట్స్ దక్కాయన్నది పార్టీ వర్గాల మాట. అంతకుముందే చిత్తూరు జిల్లాలో తనదైన మార్క్ రాజకీయం చేసే పెద్దిరెడ్డి 2019 తర్వాత మరింత బలపడ్డారు. ఏకంగా చంద్రబాబు నాయుడును కుప్పం రాకుండా అడ్డుకోగలిగే స్థాయికి వెళ్ళింది అప్పట్లో ఆయన పలుకుబడి. ఇక పుంగనూరు గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


ఇటు సొంత పార్టీలోని సీనియర్స్ సైతం అయన చెప్పింది వేదం అన్నట్టుగా ఉండేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. పరిస్థితులు తిరగబడ్డాయి. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత జిల్లాలో పెద్దాయనకు కూడా చుక్కలు కనిపిస్తున్నాయన్నది వైసీపీ వర్గాల్లో టాక్. గడిచిన వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపైనే ఇప్పుడు జిల్లాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. వారం క్రితం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పుంగనూరు వెళ్లకుండా అడ్డుకున్నాయి టీడీపీ శ్రేణులు. దీంతో చేసేదేమీ లేక వెనుతిరిగారు ఆయన. ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది అంటున్నాయి స్థానిక రాజకీయవర్గాలు.


ఈ విడత సీఎం హోదాలో తొలిసారి రెండు రోజులు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు చంద్రబాబు. పుంగనూరు టీడీపీ ఇన్చార్జి చల్లా బాబుతో పాటు పలువురు నియోజకవర్గ నేతలు వెళ్లి ఆయనను కలిశారు. చంద్రబాబు కుప్పం నుంచి ఇలా అడుగు బయట పెట్టారో లేదో అటు పుంగనూరులో ప్రకంపనలు మొదలయ్యాయి. మున్సిపల్ చైర్మన్ తో పాటు 12 మంది కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేసి సైకిల్ ఎక్కారు. ఇంకొందరు కూడా సైకిల్ ఎక్కేందుకు రెడీగా ఉన్నారట. దీంతో ఓ నియోజకవర్గానికి వెళ్లి మీటింగ్ పెట్టి పరిస్థితిని అక్క పెట్టే ప్రయత్నం చేశారు ఎంపీ మిథున్ రెడ్డి.


కానీ అనూహ్యంగా మిథున్ రెడ్డిని తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు ఆయన పుంగనూరు వెళితే శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందని చెప్పినట్టు తెలిసింది. ఇంత జరుగుతున్న వైసీపీ మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఎవ్వరు మాట మాత్రం స్పందించకపోవడంపైనే ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చర్చ జరుగుతుంది. మాట కాదు కదా అటు రాయలసీమ నేతలు కానీ, ఇటు ఇతర జిల్లాలోని పార్టీ పెద్దలు ఎవ్వరు కనీసం ఎక్స్ లో పోస్ట్ కూడా ఎందుకు పెట్టడం లేదని ఆశ్చర్యంగా చూస్తున్నాయట వైసీపీ శ్రేణులు.


మరింత సమాచారం తెలుసుకోండి: