తెలంగాణలో గత డిసెంబర్ నెలలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తొలి ఆరునెలలపాటు పాలనపై పూర్తిగా దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రాజకీయంగా.. అసలు ఆట ప్రారంభించేశారు. గతంలో కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి బలం ఉన్న కూడా.. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలి అన్నట్టుగా.. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను వరుస పెట్టి బలవంతంగానో లేదా బెదిరించో తమ పార్టీలో చేర్చుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి తొలి ఆరునెలలు జంపింగ్ రాజకీయాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు.


ఇప్పుడు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా పునాదులతో సహా కదిలించాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను వరుస పెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కీలకమైన మహబూబ్‌న‌గర్ జిల్లాలోని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్‌కు చెందిన మామ, అల్లుళ్లు మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి తో పాటు.. ఆయన అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సైతం కాంగ్రెస్ గూటికి చేరే ప్రయత్నాలు నడుస్తున్నాయి.


ఇక గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయనకు గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితకు మధ్య విభేదాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్‌లో చేరి కృష్ణమోహన్ రెడ్డి పై పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల జడ్పీ చైర్పర్సన్ గా సరిత పదవీకాలం ముగియనుంది. దీంతో ఎమ్మెల్యే పార్టీ మారటం దాదాపుగా ఖాయం అయిందని.. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వెళతారని తెలంగాణ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ మారే విషయమై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి.. ఇప్పటికే తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారని.. త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తల సమావేశం పెట్టి.. వారి అభిప్రాయం తీసుకుని పార్టీ మారతారని సమాచారం. ఏది ఏమైనా బిఆర్ఎస్ పార్టీ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: