ఆంధ్రప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే 1982లో తెలుగుదేశం పార్టీ పుట్టాక ఈ నాలుగున్నర దశాబ్దాలలో ఎప్పుడు లేనంత ఘనవిజయాన్ని ఈ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ జనాలు తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టారు. ప్రతిపక్ష వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఘనవిజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారి తెలంగాణ గడ్డపై అడుగుపెడుతున్నారు. ఈనెల ఆరో తేదీన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కోసం హైదరాబాద్‌కు వస్తున్న సంగతి తెలిసిందే.


అలాగే ఏడో తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వెళుతున్నారు. నాలుగో సారి సీఎం అయ్యాక మొదటిసారి ఎన్టీఆర్ భవన్‌కు వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు.. తెలంగాణకు చెందిన తెలుగు తమ్ముళ్లు హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడు ఎంపికతో పాటు.. పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యచరణ.. స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీపై.. నేతలతో అధినేత చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.


రాష్ట్ర విభజన జరిగినా కూడా చాలామంది కార్యకర్తలు నేతలు ఇంకా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు.
తెలంగాణ పై చంద్రబాబు కాస్త ఫోకస్ చేస్తే తిరిగి పట్టాలెక్కుతుందన్న విశ్వాసంతో కొందరు అభిమానులు ఉన్నారు. ఎన్నికలకు ముందు వరకు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. పైగా బిఆర్ఎస్ లో ఉన్న చాలామంది నేతలు తెలుగుదేశం నుంచి వెళ్లిన వారే. ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకాలు వారు ఎవరికి లేవు. అందుకే వారంతా ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.


వీరితో పాటు చాలామంది టీడీపీ మాజీ నేతలు సైతం తెలుగుదేశం పార్టీకి టచ్‌లోకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. పైగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఘనవిజయం సాధించటంతో చాలామంది టీడీపీలోకి వచ్చే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళలేని వారంతా ఇప్పుడు టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: