బైక్ రేసింగ్ కారణంగా నిత్యం ఎందరో యువకులు మరణిస్తున్నారు. సెలబ్రిటీల పిల్లలు సైతం ఇలాంటి బైక్, కార్ రేసింగ్‌లలో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీటిని నిత్యం అడ్డుకుంటున్నా చాలా మంది యువకులు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ బైక్ రేసింగ్‌లలో పాల్గొంటున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సినిమా స్టార్, ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రి అయి ఉండి బైక్ రేసింగ్‌లనే మాట పవన్ నోట రావడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. పవన్ వచ్చాడంటే చాలు, కేవలం నిమిషాల్లో దావానలంలా ప్రజలు వచ్చేస్తారు. ముఖ్యంగా యువకులు బైక్‌లపై వెంటపడుతూ, ఆయనకు అనుకూలంగా నినాదాలు చేస్తుంటారు. బీర్, బిర్యానీ వంటివి ఇవ్వకపోయినా పవన్ సభలకు వేలాదిగా, లక్షలాదిగా యువకులు తరలి వస్తుంటారు. ఇలాంటి వ్యక్తి నోటి నుంచి బైక్ రేసింగ్ అనే మాట రావడం సరికాదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇటీవల పవన్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటించారు. నియోజకవర్గ ప్రజలను తనను డిప్యూటీ సీఎం చేశారని కొనియాడారు. ఇదే తరుణంలో ఇటీవల కాలంలో బైక్ నంబర్ ప్లేట్లపై బాగా ట్రెండింగ్ అయిన 'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' అంశంపై ఆయన స్పందించారు. ఇలాంటి ప్లేట్లు పెట్టినా, యువకులంతా పోలీసులుకు సహకరించాలన్నారు. నిబంధనలను పాటించకుండా, బైక్‌లకు 'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' అని నేమ్ బోర్డు పెట్టి చెడ్డ పేరు తీసుకు రావొద్దని కోరారు. ఇదే క్రమంలో ఆయన తాను పిఠాపురం నియోజకవర్గంలో 3 ఎకరాల స్థలం కొన్నానని చెప్పారు. అవసరమైతే ఆ స్థలంలో మడ్ రేస్ నిర్వహిస్తానని ఆయన యువతకు హామీనిచ్చారు. దీనికి తగ్గట్టుగా హెల్మెట్లు, సేఫ్ గార్డులు సిద్ధంగా ఉంచుతామని పేర్కొన్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలకు యువకులు కేరింతలు కొట్టారు. ప్రస్తుతం పవన్ బాధ్యత గల డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఇలాంటి అత్యున్నత పదవిలో ఉండి బైక్ రేసింగ్‌లు నిర్వహిస్తాననడం ఎంత వరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్ ఒక్క పిలుపు ఇస్తే లక్షల మంది యువకులు, ప్రజలు కదిలి వస్తారని, అలాంటి వ్యక్తి బైక్ రేసింగులు చేపడతానని చెప్పడం సరికాదని పేర్కొంటున్నారు. పవన్ పిలుపుతో ఎవరైనా బైక్ రేసింగులలో పాల్గొని చనిపోతే, ఆ చెడ్డ పేరు పవన్‌కే వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: