రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్, చంద్రబాబు హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా రేపు (శనివారం) భేటీ కాబోతున్నారు.తాజాగా ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహూర్తం ఖరారు అయ్యింది. శనివారం సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్, చంద్రబాబు ప్రజా భవన్ వేదిగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో గత పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా విభజన చట్టం షెడ్యూల్ 9 లోని 23 సంస్థలు, షెడ్యూల్ 10లోని 30 సంస్థల విభజనపై రేవంత్, బాబు డిస్కస్ చేయనున్నారు. వీటితో పాటు విద్యుత్ బకాయిలు, ఐదు గ్రామాల విలీన ప్రక్రియ గురించి మాట్లాడనున్నారు.

కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బాబు.. రాష్ట్ర విభజన సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ముఖాముఖీ భేటీ అయ్యి విజభన అంశాలపై చర్చిద్దామని తెలంగాణ సీఎం రేవంత్‌కు లేఖ రూపంలో ప్రతిపాదన పంపారు. చంద్రబాబు ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన రేవంత్.. భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు ప్రజాభవన్ వేదికగా సాయంత్రం 6 గంటలకు భేటీ కాబోతున్నారు. సీఎంల హోదాలో రేవంత్, చంద్రబాబు ఫస్ట్ టైమ్ కలవనుండటంతో ఈ భేటీ ఇటు తెలంగాణ అటు ఏపీ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ సందర్భంగా పార్టీ అధినేతకు ఘనసన్మానం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ భవనకు తరలిరావాలని పిలుపునిచ్చింది.

ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తొలిసారి ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర పార్టీ సిద్ధమైంది. 6న ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. 7వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ భవన్ కు వస్తారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడికి పెద్దఎత్తున సన్మాన కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: