వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమీప బంధువు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి బాలినేని.. జగన్ వెంట నడుస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్ ఎంతో ప్రేమతో వాసు మామ అని ముద్దుగా బాలినేనిని పిలుచుకుంటారు. అలాంటి బాలినేనికి 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కీలకమైన మంత్రిత్వశాఖ కూడా కట్టబెట్టారు. ఎక్కడ తేడా కొట్టిందో..? ఏమో..? మూడేళ్ల తర్వాత ప్రక్షాళనలో బాలినేని మంత్రి పదవి జగన్ పీకేశారు. ఆయన ఎంత ప్రయత్నించినా జగన్ మాత్రం కనికరించలేదు. అక్కడికి వెనక్కి తగ్గిన బాలినేని తన మంత్రి పదవి తీసేసిన జిల్లాకే చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కూడా క్యాబినెట్ నుంచి తప్పించాలని విశ్వప్రయత్నాలు చేసినా.. జగన్ మాత్రం ఒప్పుకోలేదు.


సురేష్ ను క్యాబినెట్‌లో కంటిన్యూ చేశారు. చివరి రెండు సంవత్సరాలు బాలినేనికి రాజకీయంగా కూడా ప్రాధాన్యత తగ్గించేశారు. ఒకానొక దశలో ఎన్నికలకు ముందు బాలినేని.. జనసేన లేదా టీడీపీలోకి వెళ్లిపోతార‌న్న ప్రచారం కూడా జరిగింది. జగన్ సైతం బాలినేనిని దూరం పెట్టారు. చివరకు ఒంగోలులో ఇళ్ల పట్టాలకు కేటాయించాల్సిన మొత్తాన్ని కూడా.. ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది రోజుల ముందు మాత్రమే రిలీజ్ చేశారు. అప్పటివరకు బాలినేని ఎంతో టెన్షన్ పడ్డారు. ఎన్నికల్లో అ యిష్టంగానే పోటీ చేశారు. జగన్ పై ఎంతో కోపం ఉన్న మనసులో దాచుకుంటూ వచ్చారు. ఇక ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఒంగోలులో బాలినేని కూడా టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అయితే ఇక్కడే బాలినేని ఒక విషయంలో ఫుల్ ఖుషి గా ఉన్నారట.


ఎన్నికలకు ముందు బాలినేని పట్టుబట్టి తన అనుచరుడు అయిన తాటిపర్తి చంద్రశేఖర్‌కు ఎర్రగొండపాలెం టికెట్ ఇప్పించుకున్నారు. అక్కడి నుంచి మంత్రి ఆది మూలపు సురేష్‌ను కొండపికి మార్చారు. కొండపి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎన్నికల్లో సురేష్ కొండపిలో ఓడిపోయారు. అయితే ఎర్రగొండపాలెంలో తాను పట్టుబ‌ట్టి టిక్కెట్ ఇప్పించుకున్న చంద్రశేఖర్ మాత్రం విజయం సాధించారు. ఒకవేళ సురేష్ ఎర్రగొండపాలెం లో పోటీ చేసి ఉంటే కచ్చితంగా విజయం సాధించేవారు. బాలినేని చక్రం తిప్పి సురేష్ ను కావాలని కొండపికి మార్పించి.. అక్కడ తన అనుచరుడు చంద్రశేఖర్‌కు సీటు ఇప్పించుకున్నారు. అలా ఆదిమూలపు సురేష్ గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. తొలిసారి ఆయనకు కొండపిలో ఓటమి రుచి చూపించారు బాలినేని. ఇలా పరోక్షంగా బాలినేని తన రివెంజ్ తీర్చుకున్నారు అన్న చర్చలు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: