దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య 2022 మేలో జరిగింది. ఆ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్ అయ్యారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఈ వ్యవహారం నడిచింది. మొదట అనుమానస్పద మృతిగా కేసును బుక్ చేసిన పోలీసులు.... తర్వాత అనంత బాబును అరెస్ట్ చేసి చూపించారు. అప్పట్లో కాకినాడ పోలీసుల తీరుపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇదే కేసులో ఆరు నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు ఎమ్మెల్సీ అనంత బాబు. మొదట అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ.

ఇక తాజా ఎన్నికల్లో రంపచోడవరం, పత్తిపాడు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది. కానీ ఎన్నికల ప్రచారంలో కొన్ని గ్రామాల్లో అతడిని జనం అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని వైసీపీ పెంచి పోషిస్తుందంటూ ఎన్నికల సమయంలో గట్టిగానే ప్రచారం చేశాయి కూటమి పార్టీలు. అది ఓటర్ల మనసులో కూడా బలంగానే నాటుకుపోయింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చాక సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకొని న్యాయం చేస్తామని ప్రతిపక్ష హోదాల్లో ప్రకటించింది టీడీపీ.


ఇప్పుడు అధికార మార్పిడి జరిగి తెలుగుదేశమే పవర్ లోకి రావడంతో సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు తెర మీదకి వచ్చారు. కేసును తిరిగి విచారించాలని డిమాండ్ చేయడంపై ఆసక్తికరమైన చర్చ మొదలైందట. ఈ కేసును సిబిఐకి ఇవ్వాలన్నది డ్రైవర్ కుటుంబ సభ్యుల డిమాండ్. అయితే అలా అడగమని టీడీపీ వారే ఆ డ్రైవర్ కుటుంబసభ్యుల నుంచి చెప్పించారన్న ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. దానికి తగినట్టుగా స్క్రీన్ ప్లే కూడా వర్కౌట్ అయిందన్న చర్చ కూడా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో.

ఇందులో నేరుగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడం కంటే బాధితులు డిమాండ్ చేశారు కాబట్టి తాము రికమెండ్ చేశామని చెప్పడానికి వీలుగా స్కెచ్ రెడీ అవుతుందన్నది పరిశీలకుల అభిప్రాయంగా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో తమ పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి కాపాడారని.... కానీ మా హయాంలో తప్పు చేసిన ఎవరికైనా ఒకే శిక్ష ఉంటుందన్న సంకేతాలు ప్రజల్లోకి పంపడానికి కూడా ఈ ఎపిసోడ్ ఉపయోగపడుతుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందులోనూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండేళ్లలపాటు ఆ కేసు గురించి చాలా ప్రచారాలు చేసాం. కాబట్టి ఇప్పుడు గట్టిగా పట్టుకుంటే దళిత సామాజిక వర్గాల్లో కూడా పాజిటివ్ టాక్ వస్తుందన్న చర్చ టీడీపీ పార్టీలో జరుగుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: