రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తాజాగా భేటీ కాగా ఏపీ, టీజీ ప్రజల మేలు కోసమే బాబు, రేవంత్ భేటీ అయ్యారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడంచెల విధానంలో విభజన సమస్యల పరిష్కారానికి ఈ ఇద్దరు నేతలు కృషి చేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కావడంతో పాటు వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు.
 
రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఒక కమిటీ, రెండు రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అక్కడ సమస్యల పరిష్కారం జరగకపోతే ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చలు జరపడం ద్వారా నిర్ణయం తీసుకోనున్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను ఒకరికొకరు అధికారికంగా ఇచ్చిపుచ్చుకోవడం గమనార్హం.
 
చంద్రబాబు, రేవంత్ రాకతో ప్రజాభవన్ సందడిగా మారడం గమనార్హం. ఇద్దరు సీఎంలు ఆప్యాయంగా పలకరించుకోవడంతో పాటు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ఉమ్మడిగా యుద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారుల సూచనలను సైతం తీసుకొని పెండింగ్ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్చించారు. రెండు నుంచి మూడు వారాల వ్యవధిలో సీఎస్ లు ఉన్నతస్థాయి కమిటీ నిర్వహించనున్నారని తెలుస్తోంది.
 
ఐదు గ్రామ పంచాయితీలను తమకు తిరిగి ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరగా ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని బాబు చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని కొన్ని భవనాలు కావాలని ఏపీ అధికారులు కోరగా ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంటే స్థలం కేటాయిస్తామని చెప్పినట్టు భోగట్టా. చంద్రబాబు, రేవంత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకున్నామనే నమ్మకాన్ని కలిగిస్తారో లేదో చూడాల్సి ఉంది. చంద్రబాబు, రేవంత్ మధ్య ఉన్న అనుబంధం వల్ల కూడా సమస్యలు వేగవంతంగా పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాబోయే రోజుల్లో సమస్యల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: