నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి అనే సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాల 3 నెలలు వైఎస్సార్ సీఎంగా పని చేశారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్సార్ భరోసాగా నిలిచారు. అభివృద్ధి, సంక్షేమంతో వైఎస్సార్ తన ముద్ర వేసుకున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా వ్యవసాయ రంగంలో వైఎస్సార్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
 
రైతుల కోసం వైఎస్సార్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. వైఎస్సార్ భౌతికంగా మరణించినా ఆయనను అభిమానించే అభిమానుల హృదయాలలో మాత్రం జీవించి ఉన్నారు. వైఎస్సార్ అమలు చేసిన ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీమ్ ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్య కలలను నెరవేర్చుకోవడానికి కారణమైంది. వైఎస్సార్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఏకంగా 41 ప్రాజెక్ట్ లను పూర్తి చేశారంటే వ్యవసాయంపై ఆయనకు ఉన్న మక్కువ ఏపాటిదో సులువుగా అర్థమవుతుంది.
 
సంక్షేమం, అభివృద్ధి పథకాలతో వైఎస్సార్ తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచారు. పరిపాలనలో మానవత్వంతో వ్యవహరించి వైఎస్సార్ ప్రశంసలు అందుకున్నారు. కోట్ల సంఖ్యలో ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చెరగని ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జీవచ్ఛవంలా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవం పోశారని చెప్పవచ్చు.
 
ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు అందించిన ఘనత వైఎస్సార్ కే సొంతమని చెప్పవచ్చు. 108, 104 ఆంబులెన్స్ సర్వీస్ ల ద్వారా వైఎస్సార్ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. కేంద్రం ప్రస్తుతం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కు ఒక విధంగా ఆరోగ్యశ్రీ స్కీమ్ స్పూర్తి అని చెప్పవచ్చు. విదేశాల్లో సైతం వైఎస్సార్ జయంతి వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. వైఎస్సార్ లాంటి మహానేత, ప్రజలకు మేలు చేసే పథకాలను అమలు చేసే నేత మళ్లీ పుట్టరని ఆయన అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

ysr