హిందూపురం వైసీపీ పార్టీ నేతల్లో అసంతృప్తి బయటపడుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ కంచుకోటగా.... నందమూరి కుటుంబానికి పెట్టని కోటగా నిలుస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలయ్యకు తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలు మరోమారు నందమూరి కుటుంబంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేగా బాలకృష్ణ మరోసారి విజయం సాధించడం ....అక్కడి ప్రతిపక్ష వైసీపీకి ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురంలో జెండా ఎగరవేయాలని గట్టి ప్రయత్నాలు చేసింది వైసీపీ.


అధికారంలో ఉన్నన్నాళ్లు హిందూపురంపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ ఓటమి లక్ష్యంగా ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాయలసీమ ఇన్చార్జిగా ఉన్న అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దింపింది. పార్టీ గెలుపు కోసం ఆయన నియోజకవర్గంలో కలియతిరిగారు. క్యాడర్ ను సమాయత్తం చేశారు. ఎలాగైనా బాలకృష్ణను ఓడించాలనే లక్ష్యంతో పనిచేశారు. హిందూపురంలో మకాం పెట్టడమే కాకుండా ఎన్నికల ముందు అసమ్మతి నేతలను ఏకతాటిపైకి తెచ్చి ప్రచారం జోరుపెంచారు.

పార్టీలో వర్గాలుగా ఉన్న నవీన్ నిశ్ఛల్, వేణుగోపాల్ రెడ్డి, మధుమతి రెడ్డి లాంటి నేతలను కలిపే ప్రయత్నం చేశారు. ఇక పార్టీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన కురుబ దీపికను ప్రకటించింది వైసీపీ. బీసీ కార్డు పనిచేస్తుందని భావించి హిందూపురం ఎంపీ స్థానాన్ని కూడా బోయ సామాజిక వర్గానికి చెందిన శాంతమ్మకు కేటాయించారు. అయితే ముందు నుంచి వైసీపీలో కొనసాగుతున్న వర్గవిభేదాలు ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బ కొట్టాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూపురం వైసీపీ ఇన్చార్జ్ గా కొనసాగుతున్న ఇక్బాల్ అహ్మద్ ను కాదని నియోజకవర్గ ఇన్చార్జిగా కురుబ దీపికను నియమించడాన్ని ఆయన వర్గం వ్యతిరేకించింది.


హిందూపురంలో పార్టీ పటిష్టతకు కృషి చేసిన ఇక్బాల్ ను పక్కకు పెట్టడంతో ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. మైనార్టీ వర్గ నేతలు టీడీపీకి మద్దతు పలికారు. దాంతో ఎన్నికల్లో టీడీపీకి తిరుగులేని మెజార్టీ లభించింది. అయితే ఎన్నికల అనంతరం వైసీపీ అభ్యర్థి కురుబ దీపిక కనిపించడం లేదంటూ క్యాడర్ లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆమె స్థానికంగా లేకపోవడంపై ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. బాలయ్య దెబ్బకే వైసీపీ పరిస్థితి ఇలా తయారైందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: