- పాద‌యాత్ర‌తో చ‌చ్చిపోయిన కాంగ్రెస్‌ను బ‌తికించిన మ‌హానేత‌
- రైతు బాంధ‌వుడు.. పేద‌ల నేస్తం.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప‌క్ష‌పాతి
- తెలుగు రాజ‌కీయాల్లో 2004 త‌ర్వాత స‌రికొత్త వైఎస్సార్ శ‌కం

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి వరకు పది సంవత్సరాలు పాలించినటువంటి టిడిపిని అధికార నుంచి దించేందుకు కాంగ్రెస్‌లో బలమైన నాయకులు ఎవరున్నారని భూతద్దం పెట్టుకుని వెతికినటువంటి సందర్భం కనిపించింది. అటువంటి సమయంలో నేనున్నానంటూ ఆయ‌న‌ వెలుగులోకి వచ్చారు. ఆ వయసులో సుదీర్ఘ పాదయాత్రను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగారు.


వాస్తవానికి ఆ సమయంలో పాదయాత్ర చేసేందుకు ఏ నాయకుడు ఇష్టపడలేదు. కానీ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయడం ద్వారా మాత్రమే కాంగ్రెస్ మళ్ళీ పంచుకుంటుందని బలమైనటువంటి నిర్ణయంతో ముందుకు సాగారు. అంతేకాదు ఒక చరిత్రను సృష్టించారు. తాను చేసినటువంటి పాదయాత్రలో అన్ని వర్గాల వారినీ కలుసుకున్నారు. ప్రధానంగా మైనారిటీ వర్గాల సమస్యలను ఎక్కువగా ప్రస్తావించారు. మైనారిటీ వర్గాల సమస్యలపై ప్రత్యేకంగా ఆయన తన పాదయాత్రలో దృష్టి పెట్టారు. ఫలితంగా 2004కు ముందు కాంగ్రెస్ పార్టీకి 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీకి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.


అప్పటివరకు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు పెద్దగా లభించింది అని చెప్పేందుకు దాఖలాలు లేవు. కానీ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర తరువాత ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఓటు బ్యాంకు గుండు గుత్తగా కాంగ్రెస్‌కు లభించింది. ఆ బలంతోనే కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు 2004, 2009 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. ఇక రాజకీయంగా చూసుకున్నప్పటికీ తన శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకున్నటువంటి చరిత్ర రాజశేఖర్ రెడ్డిది.


ఒకప్పుడు పబ్బతిరెడ్డి జనార్దన్ రెడ్డి వైయస్ ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అదేవిధంగా జైపాల్ రెడ్డి వంటి వారు కూడా వైయస్ ను విభేదించారు. కానీ అనేకమంది నాయకులను కూడా ఆయన కలుపుకుని ముందుకు సాగారు. వారి అభిప్రాయాలను తీసుకుంటూ ప్రభుత్వంలోనూ పార్టీలోనూ తనకంటూ ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నారు.  విజయవాడలో వంగవీటి మోహన్‌రంగా తనయుడు వంగవీటి రాధ స్థానిక మున్సిపల్ కమిషనర్ పై వివాదం చేసినప్పుడు దాన్ని కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించారు.


ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి పార్టీని తనదైనటువంటి శైలిలో న‌డిపించి.. ఒక ముద్ర వేసి మరో చరిత్రను సృష్టించారు అనడంలో సందేహం లేదు. ప్రధానంగా అప్పటికే బలంగా ఉన్నటువంటి రాయలసీమలో కాంగ్రెస్ పార్టీని మరింత పులోపేతం చేశారు. అదే విధంగా ఉత్తరాంధ్రలో సుజల స్రవంతి ప్రాజెక్టును తీసుకువచ్చినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డిదే. సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలను స‌శ్య‌శ్యామ‌లం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆదిశగా వేసినటువంటి అడుగులు తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీని ఉత్తరాంధ్ర జిల్లాలో బలోపేతం చేస్తుంది.


అదే విధంగా పోలవరం ప్రాజెక్టు ద్వారా కోస్తా రాయలసీమ జిల్లాలకు కూడా నీటిని అందించి, తద్వారా కరువు పీడిత ప్రాంతాలను స‌శ్య‌శ్యామ‌లం చేయాలని కలలు కన్నటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి. గతంలో అనేకమంది నాయకులు రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ రైతు బాంధవుడు, పేదల నేస్తంగా ఏ ఒక్క నాయకుడు పేరు గడించకపోవడం గ‌మ‌నార్హం. అది ఒక రాజశేఖర్ రెడ్డికి మాత్రమే సాధ్యం కావడం ఈ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం.


రాజశేఖర్ రెడ్డి జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడినా రాజకీయంగా ఆయన అనేకమంది శత్రువులతో పోరాడినా 2004లో సాధించినటువంటి ఘన విజయం తరువాత రాజశేఖర్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి అనే విధంగా ఒక బలమైన ముద్రను వేయగలిగారు. ఢిల్లీలోనూ గల్లీలోను రాజశేఖర్ రెడ్డి లేని కాంగ్రెస్‌ను ఊహించుకోలే నంత పరిస్థితిని 2004 నుంచి 2009 వరకు ఆయన తీసుకువచ్చారంటే నిజంగా రాజశేఖర్ రెడ్డి ముద్ర రాజకీయంగా ఆయన సృష్టించిన మరో చరిత్ర..!

మరింత సమాచారం తెలుసుకోండి: