ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుల మధ్య రాజకీయ పోరు మరింత రంజుగా మారుతోంది. వైఎస్ వారసత్వాన్ని కొనసాగించేది తామంటే తామంటూ జగన్, షర్మిల ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029లో ఏపీలో వైఎస్ షర్మిల సీఎం అవతారని జోస్యం చెప్పారు. తండ్రి ఆశయాలను మోసే వాళ్లను వారి రాజకీయ వారసులుగా గుర్తించాలని, కాంగ్రెస్‌ను ఏపీలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భవిష్యత్తులో ఏపీ సీఎంగా వైఎస్ షర్మిలను చూస్తామంటూ ఆమె అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ పరిస్థితులు ఉన్నాయా అనే అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది.

ఏపీ విభజనతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. దాంతో పాటు తనను కాంగ్రెస్ కుట్ర పూరితంగా జైలుకు పంపిందని జగన్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. దీంతో విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎక్కువ మంది వైసీపీలో చేరారు. 2014లో జగన్ ప్రతిపక్షానికే పరిమితమైనా, 2019లో ఆయన అధికారంలోకి రావడానికి ఒకప్పటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే కారణం. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైంది. నోటా కంటే తక్కువ ఓట్లతో పార్టీ పరిస్థితి దిగజారుతూ వస్తోంది. ఈ తరుణంలో వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దించింది. ఏపీలో కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి పొందాలని భావిస్తోంది.


 ప్రస్తుతం జగన్ ఘోర ఓటమి పాలవడం, భవిష్యత్తులో కాంగ్రెస్ వైపు ఓటర్లు వస్తారనే ఆశతో షర్మిలను బరిలోకి దించింది. కడప ఎంపీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినా షర్మిల ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆమెపై కాంగ్రెస్ అధిష్టానం చాలా ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలోనూ, రేవంత్ సీఎం అవడంలోనూ వెనుక ఎంతో కష్టం ఉంది. కార్యకర్తల్లో నైరాశ్యాన్ని పక్కకు తోలి, వారిని ఉత్సాహం ఉరకలెత్తేలా చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్‌పై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. జైలుకు వెళ్లడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అయితే ఏపీలో అలాంటి పరిస్థితులు లేవు. కాంగ్రెస్‌ను ప్రజలు దాదాపు మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని షర్మిల ఏ మేరకు బలోపేతం చేస్తారోననే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: