గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ నుంచి తాజా ఎన్నికల్లో గెలిచిన టిడిపి నాయకురాలు గల్లా మాధవి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. ఇది మంచి పరిణామం. నూతనంగా ఎన్నికైన ఆమె ప్రజల్లోనే ఉండాలి, ప్రజల సమస్యలు పట్టించుకోవాలనే దృక్పథంతో గత రెండు రోజులుగా తిరుగుతున్నారు. ఒకవైపు వర్షాలు కురుస్తూ లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రోడ్లు ఛిద్రం కావడం, అదేవిధంగా రోజువారి వ్యాపారాలు దెబ్బతినడం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో గల్లా మాధవి పర్యటిస్తున్నారు.


అయితే ఆమె ఎక్కడా కారులో కాకుండా, అధికారులను వెంటబెట్టుకొని తీసుకెళ్లకుండా స్వయంగా తను చిన్న బైకుపై ప్రయాణం చేస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేను ఉంటాను అనే నినాదంతో గల్లా మాధవి చేస్తున్న ఈ ప్రయత్నం స్థానికంగా చర్చ‌నీయాంశంగా మారింది. తనతో పాటు పార్టీ నాయకులు ఒకరిద్దరు వెంటపెట్టుకొని ఆమె సమస్యలు ఉన్న  ప్రాంతాల్లో ప‌ర్యటిస్తూ ఆయా సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. అదే విధంగా చిన్న చిన్న పనులకు సంబంధించి అప్పటికప్పుడు పరిష్కారం చూపించే మార్గాలను కూడా ఆమె అన్వేషిస్తున్నారు.


ఉన్నత విద్యావంతురాలు కావడంతో సమస్యను అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ నిధుల సమస్య అయితే ఆమెను వెంటాడుతుంది. దీనికి ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రోత్సాహం అందిస్తే గల్లా మాధవి వంటి వారు ప్రజాభిమానాన్ని అత్యంత వేగంగా పొందే  అవకాశం చాలా ఉంది. వెస్ట్ లో ఇప్పటికీ తాగునీరు అంద‌ని ప్రాంతాలు చాలా ఉన్నాయి. తాగునీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతోంది. ఈ స‌మ‌యంలో  ఇళ్లకు మంచినీటి పైప్లైన్ ద్వారా నీళ్లను అందించాలని, రహదారుల బాగుజేత‌, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాల్లో తరలించడం వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేస్తున్నారు.


ఎక్కడా ఆర్భాటాలకు పోకుండా స్వయంగా తానే బైక్ నడుపుతూ సమస్యలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి ప్రజలను కలుసుకోవడం వారికి ధైర్యం చెప్పడం ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించడం వంటివి గల మాధవికి పెట్టని కోటగా మారుతున్నాయి. ఇటువంటి ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: