అదే సమయంలో జగన్ కానీ కేసీఆర్ కానీ గొంతెమ్మ కోరికలను ఎప్పుడూ కోరలేదు. ఏపీ తీరప్రాంతంలో వాటా, పోర్టుల్లో వాటా, టీటీడీ ఆదాయంలో వాటా లాంటి ప్రతిపాదనలు ఎప్పుడూ రాలేదు. ఈ తరహా ప్రతిపాదనలు సైతం వ్యతిరేకత పెంచుతాయని తెలుసు కాబట్టే కేసీఆర్, జగన్ తమ చర్చకు సంబంధించిన విషయాలను పూర్తిస్థాయిలో వెల్లడించడానికి ఇష్టపడలేదనే సంగతి తెలిసిందే.
రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశమైన సమయంలో సోషల్ మీడియా వేదికగా ఎన్ని ట్రోల్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు, ఏపీ సీఎం బాబు ప్రతిపాదనల విషయంలో సానుకూల స్పందన రాకపోవడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేసీఆర్ జగన్ సమావేశమైన సమయంలో ఇలాంటి ప్రచారం ఎప్పుడూ జరగలేదు.
కేసీఆర్ సైతం పలు సందర్భాల్లో విభజన హామీలకు సంబంధించి, నీటి పంపకాలకు సంబంధించి చర్చించారే తప్ప అంతకు మించి ముందడుగులు వేసే ప్రయత్నం అయితే చేయలేదు. బాబు, రేవంత్ కూడా జగన్, కేసీఆర్ లా విమర్శలకు తావివ్వకుండా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే మంచిదని చెప్పవచ్చు. రాబోయే ఐదేళ్లలో అయినా విభజన సమస్యలు పరిష్కారం అవుతాయేమో చూడాలి. జగన్, కేసీఆర్ ప్రస్తుతం అధికారానికి దూరంగా ఉన్నా ఇద్దరి మధ్య సత్సంబంధాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ ఏపీ రాజకీయాలపై కొంతమేర ప్రభావం చూపుతోందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.