కానీ ఈ మార్గదర్శకాలను చూసిన తర్వాత రైతులందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. ఎందుకంటే కేవలం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని రుణమాఫీ చేస్తాము అంటూ తెలిపారు. రేషన్ కార్డులో పేరున్న కుటుంబ సభ్యులందరికీ కలిపి 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలు, రెన్యువల్ చేసిన రుణాల అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుంది అంటూ ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నారు అని సంతోష పడాల్సిన రైతులందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం సమంజసం కాదు అంటూ అభిప్రాయపడుతున్నారు. తమకు గత ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు అంటూ వాపోతున్నారు.
అయితే ఇలా రేషన్ కార్డు లేని వారికి ఇక రెండు లక్షల రుణమాఫీ జరగదా అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో రైతులందరికీ గుడ్ న్యూస్ అందింది. రేషన్ కార్డు లేని రైతులెవ్వరు కూడా ఆందోళన చెందొద్దని వారికి కూడా రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రుణం ఉన్న ఏ ఒక్కరికి అన్యాయం జరగదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబ నిర్ధారణ కోసమే అని ఒకవేళ కార్డు లేని వారికి వ్యక్తిగతంగా విచారణ చేపడతామని చెప్పుకొచ్చారు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు.. ఎవరి పేరిట రుణం ఉంది అనే విషయాలను పరిశీలించి రుణమాఫీ చేస్తాము అంటూ తెలిపారు మంత్రి తుమ్మల.