ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీ చావు దెబ్బతింది. కీలకమైన విజయవాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లతో పాటు ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ సీట్లలో కూటమి పార్టీల అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. బందరు ఎంపీ సీట్లు, అవనిగడ్డ అసెంబ్లీ స్థానంలో జనసేన గెలిస్తే.. కైకలూరు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థులు గెలిచారు. మిగిలిన అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం ఘనవిజయం సాధించింది. ఎన్నికలలో ఘోరఓటమి తర్వాత జగన్ ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి పార్టీలో మార్పులు బదిలీలకు శ్రీకారం చుట్టారు. పెనమలూరులో ఓడిన జోగి రమేష్ ను మైలవరం కు మార్చి.. పెనమలూరు పగ్గాలు దేవభక్తుని చ‌క్ర‌వ‌ర్తికి అప్పగించారు.


ఈ క్రమంలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మరోసారి పార్టీలో బదిలీలు జరగబోతున్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి విజయవాడ నగరంలో వైసీపీ బదిలీలు ఉండబోతున్నాయి. గత ఐదేళ్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉండడంతో పాటు.. మంత్రిగా కూడా పనిచేశారు వెల్లంపల్లి శ్రీనివాస్. అయితే ఈ ఎన్నికల్లో వెల్లంపల్లిని జగన్ పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గం కు మార్చారు. ఇది పూర్తిగా రాంగ్ ఈక్వేషన్. పశ్చిమ సీటును విద్యాసంస్థల అధినేత షేక్ ఆసిఫ్‌కు కేటాయించారు.


ఎన్నికలలో ఇద్దరు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు జగన్.. షేక్ ఆసిఫ్‌ను పక్కన పెట్టేసి.. వెల్లంపల్లి శ్రీనివాసరావును పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సెంట్రల్ సీటు తిరిగి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్‌కు అప్పగిస్తారా..? లేదా అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు ఇస్తారా..? అన్నది ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. ఏది ఏమైనా గత ఎన్నికలలో మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన స‌ర్నాల తిరుపతిరావు సీటు చించేసిన జగన్.. త్వరలోనే పశ్చిమ నియోజకవర్గంలో ఓడిపోయిన మైనార్టీ నేత షేక్ ఆసిఫ్ సీటు కూడా చించేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: