ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినేట్‌ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కేబినేట్‌. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినేట్‌ ఆమోదం తెలపడం జరిగింది. అలాగే... కొత్త ఇసుక విధానానికి కెబినెట్ ఆమోదం తెలిపింది. అటు కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనున్నట్లు ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినేట్‌. ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రి వర్గం ఆమోదం తెలపడం జరిగింది.


రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ. 3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషనుకు ప్రభుత్వ గ్యారెంటీకి కెబినెట్ ఆమోదం తెలిపింది కేబినేట్‌. ఇక కేబినేట్‌ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారట. నెల రోజుల పని తీరుపై చర్చ నిర్వహించారట. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్టులో ఉందని గ్రహించి మసలుకోవాలన్న సీఎం చంద్రబాబు....హెచ్వోడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల నెల సమీక్షలు చేపట్టాలని మంత్రులకు ఆదేశించారని సమాచారం.


తమ తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు వివరించాలని మంత్రులకు సీఎం బాబు ఆదేశించారు. మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచనలు చేశారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని మరోసారి స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు... అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు తెలిపారు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలని తెలిపారు.


అలాగే అసెంబ్లీ సమావేశాలపై కెబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. ఓటాన్ అకౌంట్ పెట్టాలా..? లేక ఆర్డినెన్స్ పెట్టాలా..? అనే అంశంపై కెబినెట్టులో చర్చ జరిగింది. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉందని సమాచారం.
గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శ్వేత పత్రాలు ప్రస్తావనను అసెంబ్లీలో తేవాలని నిర్ణయం తీసుకుంది  ఏపీ కేబినేట్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: