ప్రతి సంవత్సరం బడ్జెట్ సమయంలో ఆర్థిక కేటాయింపులతో పాటు నిర్మలా సీతారామన్ ధరించే చీరలపై కూడా అందరి దృష్టి ఉంటుంది. నిర్మలా సీతారామన్ దేశ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే చీరలను ధరించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. హుందాతనాన్ని ద్విగుణీకృతం చేసేలా ఉండే ఆమె ధరించే చీరలు అంటే మహిళలు ఎంతో ఆసక్తి చూపుతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఎక్కువగా చేనేత చీరలకు ఆమె ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గత ఆరు సంవత్సరాలుగా బడ్జెట్ సమయంలో నిర్మలమ్మ ధరించిన చీరలు, ఆ చీరల ప్రత్యేకతలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈసారి బడ్జెట్ సమయంలో బెంగాళీ చీరలో కనిపించిన నిర్మలమ్మ కాంతా వర్క్ చీరకు మ్యాచింగ్ గా బ్లీజ్ కలర్ బ్లౌజ్ ధరించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
 
గతేడాది బడ్జెట్ సమయంలో నిర్మలమ్మ కసూతీ పనితనంతో రూపొందించిన చీరను ధరించడం జరిగింది. ఈ చీర ఒక్కో డిజైన్ కు ఏకంగా 5,000 కుట్లు పడతాయని సమాచారం. రంగవల్లికలను స్పూర్తిగా తీసుకుని ఈ డిజైన్లను రూపొందిస్తారు. 2022 బడ్జెట్ సమయంలో నిర్మలా సీతారామన్ ఒడిశాకు చెందిన చేనేత చీరను ఎంచుకోవడం ద్వారా అప్పట్లో వార్తల్లో నిలిచారు.
 
2021 బడ్జెట్ ప్రసంగ సమయంలో తెలంగాణ పోచంపల్లి చీరను ఎంచుకుని చేనేత చీరలంటే తనకు ఎంత ఇష్టమో ఆమె చెప్పకనే చెప్పేశారు. 2020 బడ్జెట్ సమయంలో పసుపు రంగు పట్టు చీరలో కనిపించిన నిర్మలా సీతారామన్ ఆ సమయంలో నిరాడంబరంగా, హుందాగా కనిపించి మెప్పించారు. 2019 సంవత్సరంలో గులాబీ రంగు మంగళగిరి చీరను ధరించిన నిర్మలమ్మ ఆ చీరలో హుందాగా కనిపించారని కామెంట్లు వినిపించాయి.  నిర్మలా సీతారామన్ సిల్క్ లేదా కాటన్ మెటీరియల్ తో రూపొందించిన చీరలంటే తనకెంతో ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.




మరింత సమాచారం తెలుసుకోండి: